ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలిగిన తరువాత.. ఏపీ భాజపా నేతలు కూడా చంద్రబాబు సర్కారుపై మరింతగా విమర్శల తీవ్రత పెంచారు. ఏపీ భాజపా నేతల్లో కొందరైతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మొదట్నుంచీ విమర్శలు చేయడానికే పరిమితమౌతూ వస్తున్నారు. ఆంధ్రాకి అన్నీ ఇచ్చేశామని కేంద్రం అంటే.. అవును, ఇచ్చారు కదా అంటారు..! విభజన హామీల్లో కొన్ని మాత్రమే పరిశీలనలో ఉన్నాయని కేంద్రం అంటే… అవును, పరిశీలిస్తున్నారు కదా అంటారు..! ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు, వారు కూడా ఏపీకి చెందిన నేతలు, ఇక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొంతైనా వ్యవహరించాలనే తరహాలో వారు ఆలోచించడం లేదు. ఆంధ్రాలో టీడీపీని ప్రత్యర్థి పక్షంగా గుర్తించాలని, ఎదురుదాడి చేయాలని తాజాగా ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాన్నే తు.చ. తప్పకుండా అమలు చేసే పనిలోపడ్డారు.
అసెంబ్లీలో టీడీపీ నేతలకు భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. పట్టిసీమ ప్రాజెక్టులో నిధులు వృథా అయ్యాయని ఆయన ఆరోపించారు. మొదట్లో ఈ విషయం తనకు తెలీదనీ, కాగ్ నివేదిక చూశాక ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను అన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. గతంలో కనిపించని అవినీతి ఇప్పుడే కనిపిస్తోందా అంటూ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే.. తాను కూడా రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇదే రాజీనామాల అంశం మీద ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ క్యాబినెట్ లోని భాజపా మంత్రుల మాదిరిగానే వీర్రాజు కూడా రాజీనామా చేయబోతున్నారంటూ వినిపిస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారమని ఖండించారు. ఎమ్మెల్యేల కోటాలో తాను ఎమ్మెల్సీ అయ్యాననీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ శాసనసభ్యులంతా రాజీనామాలు చేస్తే.. తాను కూడా చేస్తాను అన్నారు.
విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, కంభంపాటి హరిబాబు.. ఇలా నిత్యం మీడియాలో కనిపించే ఈ భాజపా నేతలు సొంత రాష్ట్ర సమస్యలపై ఇప్పటికీ మాట్లాడటం లేదు. కేంద్ర అజెండానే భుజానికి ఎత్తుకుని మోస్తున్నారు. ఏపీలో భాజపాపై వ్యక్తమౌతున్న వ్యతిరేకతను స్థానికంగా ఉంటున్న వీరికి కూడా అర్థం కావడం లేదా..? కేంద్రం ఆడించినట్టు వీళ్లు కూడా ఆడుతూ పోతే.. భవిష్యత్తు ఇక్కడి ప్రజల నుంచి తమకే వ్యతిరేకత ఎదురౌతుందనే ఆలోచనే వీరికి రావడం లేదా..? నిన్నమొన్నటి వరకూ ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేసిందంటూ లెక్కలు చెప్పారు. ఇప్పుడు కొత్తగా అవినీతి ఆరోపణలూ రాజీనామా సవాళ్లు చేస్తున్నారు.