ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ నగరంలో వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారిలో కొందరు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అంగీకరింకచడంతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలించినట్లే ఉన్నాయి.
వాటిలో ఘెర్జి టెక్స్ టైల్స్ సంస్థ రాష్ర్టంలో రూ.2000 కోట్ల పెట్టుబడితో ఒక మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. మియర్ బర్గర్ మరియు ఫ్లిసోం అనే సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే సంస్థలు రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చెందిన పరిశ్రమలను నెలకొల్పడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. రాష్ట్రంలో బంగారు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇండానీ గ్లోబల్ సంస్థ సంసిద్దత వ్యక్తం చేసింది.
ఎథికల్ కాఫీ కంపెనీ రాష్ట్రంలో కాఫీ పొడి తయారీ పరిశ్రమను నెలకొల్పడానికి ఆసక్తి చూపింది. అరుకులో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నందున ఏపిలో కాఫీ పరిశ్రమ నెలకొల్పడానికి మంచి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. వారు రాష్ట్రంలో కాఫీ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వస్తే అందుకు అవసరమయిన అన్ని అనుమతులను, సౌకర్యాలను సత్వరం కల్పిస్తామని హామీ ఇచ్చేరు.
రాష్ట్రంలో వంట నూనె శుద్ధి పరిశ్రమ, వ్యర్ధ పదార్ధాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ, జలవిద్యుత్ పరిశ్రమల ఏర్పాటు కోసం సంబంధిత సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. వాటిలో కొన్ని మూడు నాలుగు నెలలలోగా రాష్ట్రంలో సర్వే నిర్వహించి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
ఇటీవల విశాఖలో నిర్వహించిన సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సులో కూడా దేశవిదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలలో కనీసం 50 శాతం ఫలించినా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.