మల్టీస్టారర్ సినిమా అనగానే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. కానీ… లోలోపల భయాలు. ఇద్దరు స్టార్లని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అన్నింటికంటే ముఖ్యంగా అభిమానుల్ని సంతృప్తి పరచడం ఇంకా కష్టం. ఇద్దరు హీరోల్లో ఎవరి పేరు ముందు వేయాలి? అనే ప్రశ్న మల్టీస్టారర్‌ని నెత్తిమీద వేసుకున్న ప్రతీ దర్శకుడికీ ఎదురవుతుంది. అలాంటి ప్రశ్న.. రాజమౌళికి ఎందుకు ఎదురవ్వదు. అయితే దాన్ని తెలివిగా, తనదైన స్టైల్లో దాటేశాడు జక్కన్న.
ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లతో రాజమౌళి ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది # RRR# అంటూ మూడు ఆర్‌లను చూపిస్తూ.. తెలివిగా ఈ గండం నుంచి గట్టెక్కాడు. రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు అనే అర్థం వచ్చేలా ఈ సింబల్ ఎంచుకున్నాడన్నమాట. ఇక నుంచి ఈ సినిమాని ఇలానే పిలవబోతున్నారు అభిమానులు. మొదటి ఆర్ ఎవరిది? రెండో ఆర్ ఎవరిది? అనే ప్రశ్న ఉండదు. ఎందుకంటే ఎవరికి తోచినట్టు వాళ్లు అభివర్ణించుకోవొచ్చు. ఇలా పేర్ల ప్రాధాన్యం విషయంలో తెలివిగా ఆలోచించి అడుగువేసిన రాజమౌళి.. తెరపై కూడా ఇద్దరి ఇమేజ్‌ని ఇలానే తెలివిగా బ్యాలెన్స్ చేస్తూ, ఆయా హీరోల అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అదే జరిగితే.. రాజమౌళి మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం.