తెలుగు360.కామ్ రేటింగ్ : 3.5/5
వర్షం పడుతోంది.
తెల్లచొక్కా వేసుకొని రోడ్డుమీద వెళ్తున్నావు
ఓ కారు నీ పక్కనుంచి బురద జల్లుకుంటూ దూసుకుపోయింది. నీ చొక్కా పాడైంది. అప్పుడేం చేస్తావు?
ఎ. రాయిచ్చుకుని కారు మీదకు విసురుతావు
బి. వర్షం పడుతున్నప్పుడు తెల్లచొక్కా వేసుకుని రావడం తప్పని తెలుసుకుంటావు
సి. పోనీలే.. అంటూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తావు
దీనికి మీ సమాధానం ఏమిటి?
లోలోపల అందరి సమాధానం `ఏ`… రాయిచ్చుకుని కొట్టడమే.
కానీ… సమాజం కోసం, మంచివాడు అనిపించుకోవడం కోసం.. `సి`ని ఎంచుకుంటారు. పర్సనాలిటీ డవలెప్మెంట్
క్లాసుల్లో చెప్పేది అదే. అలాగైతేనే ఎదుగుదల ఉంటుందని, లేకపోతే ఎదగలేమని.. రుద్ది రుద్ది మరీ చెబుతారు. మరి ఇవన్నీ నిజాలేనా?? లేదంటే భ్రమల్లో బతకడానికి వేసుకుంటున్న సంకెళ్లా?? వీటిపై చర్చించిన సినిమా.. నీదీ నాదీ ఒకే కథ.
కథ
మనలాంటి ఓ మామూలు కుర్రాడి కథ ఇది. అతని పేరు రుద్రరాజు సాగర్ (శ్రీవిష్ణు). చదువు అస్సలు ఎక్కదు. డిగ్రీ పల్టీ కొట్టీ కొట్టీ…. విసిగించేస్తుంటాడు. తండ్రి రుద్రరాజు దేవి ప్రసాద్ (దేవి ప్రసాద్) ఓ టీచర్. ఎంతోమందికి విద్యాదానం చేసిన మనిషి. పండిత పుత్ర పరమ సుంఠ… అన్నట్టు ఇంట్లోనే ఓ చదువురాని మొద్దుని పెట్టుకున్నాడు. తండ్రి కోసం ఏదోటి అవ్వాలన్నది కొడుకు ఆశ. అందుకోసం పర్సనాలిటీ డెవలెప్ మెంట్స్ బుక్సన్నీ చదువుతాడు. వ్యక్తిత్వ వికాసం క్లాసులకు వెళ్తాడు. దాంతో ఇంకాస్త కన్ఫ్యూజన్ పెరుగుతుంది. సెటిల్మెంట్ అవ్వడమే జీవితమా?? పాన్ షాప్ వాడిదీ, కొబ్బరి బొండాలు అమ్మేవాడిదీ లైఫ్ కాదా? వాళ్లంతా సంతోషంగా ఉండడం లేదా? అనే ప్రశ్న లేవనెత్తుతాడు. తనే సమాధానం వెదుక్కుంటాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా.
విశ్లేషణ
ఆమె: `డబ్బులు సంపాదించడం ఎలా? అనే పుస్తకం రాలేదా?
అతడు: `రైటర్ దగ్గర డబ్బుల్లేక రీప్రింట్ వేయలేదు`
వినడానికి ఇదేదో జోక్‌లా అనిపిస్తుంది. కానీ.. నిజం. డబ్బులు సంపాదించడం తెలిసి ఉంటే.. వాడెందుకు పుస్తకాలేసుకుని అమ్ముకోవాలి..? విజయం సాధించే మార్గాలు తెలిసిన వాళ్లు.. రాయడం ఆపేసి కంపెనీలు పెట్టొచ్చు కదా, డబ్బులు సంపాదించుకోవొచ్చు కదా? పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుల కోసం ఎందుకు ఎదురు చూడాలి..??
ఇలాంటి చర్చ జరిగిన సినిమా ఇది. ఈ సమీక్ష మొదలెట్టిన ప్రశ్నలోనే ఈ సినిమాకి సంబంధించిన ఆయువు ఉంది. పర్సనాలిటీ డెవలెప్మెంట్ పుస్తకాల్లో ఉన్నది వేరు.. నిజం వేరు. అవన్నీ కల్లబొల్లిమాటలు. జీవితంలో స్థిరపడడం అంటే డబ్బులు సంపాదించడం కాదు, సంతోషంగా బతకడం. పెద్దయ్యాక.. ఐఐటీలు చదువుకుని, ఉద్యోగాలు సంపాదించుకుని, పెద్ద పెద్ద జీతాలు అందుకుని, అప్పుడు హాయిగా బతుకుదాం అనుకుని, చిన్నప్పుడు తమ చిన్న చిన్న ఆనందాల్ని త్యాగం చేస్తున్న పిల్లలు.. తమని తాము అద్దంలో చూసుకునే సినిమా ఇది. సంపాదన వేరు, సంతోషం వేరు. పుస్తకాల్లో చదవడం వేరు, జీవితాల్లోంచి తెలుసుకోవడం వేరు అనే పాయింట్ ని బలంగా చెప్పాలన్నది దర్శకుడి తాపత్రయం. దాన్ని చెప్పడంలో అతను ఎంత వరకూ విజయవంతమయ్యాడన్నది పక్కన పెడితే.. చెప్పాలనుకున్న పాయింట్ మంచిది. ఈ సమాజానికి అవసరం కూడా. అందుకే.. మరో మాట లేకుండా ఇలాంటి పాయింట్‌ని చెప్పాలనుకున్న దర్శకుడ్ని అభినందించాలి.
రుద్రరాజు సాగర్ అనే వ్యక్తులు తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఉంటారు. అందుకే సాగర్ పరీక్షల కోసం పడే కుస్తీపాట్లు కొత్తగా అనిపించవు. దాంతో కథలో తొందరగానే లీనం అయిపోతాం.
రుద్రరాజు దేవి ప్రసాద్ లాంటి నాన్న ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. కాబట్టి.. ఆయనా త్వరగానే నచ్చేస్తాడు. కాబట్టి ఆ ఇంట్లో మనం కూడా ఓ మనిషైపోతాం. ఓ సగటు నాన్నలా ఆలోచిస్తే దేవి ప్రసాద్‌ది తప్పు కాదు. తన ఇష్టాల్ని చంపుకుంటూ నాన్నల కోసం ఏదైనా ఓ ఉద్యోగంలో స్థిరపడదాం అనుకున్న సాగర్ దృష్టి కోణంలో ఆలోచిస్తే అతనిదీ తప్పు కాదు. తండ్రీ కొడుకుల ఘర్షణ వాటి చుట్టూ అల్లు కున్న సన్నివేశాలు ఈ సినిమాకి బలం. విశ్రాంతి ఘట్టం వరకూ.. ఎలాంటి బ్రేకు లేకుండా ఈ బండి సాఫీగానే సాగిపోతుంది. ఆ తరవాత.. సంఘర్షణను ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా బాగానే రాసుకున్నాడు. మధ్యలో ఓ ప్రేమకథ.. అసలు కథని డైవర్ట్ చేస్తుందేమో అనిపించింది. అసలు పాయింటగ్ వదిలేసి, కథానాయకుడి సమస్యని వదిలేసి ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపించింది. అసలు హీరో సమస్యేంటి? అతనెందుకు ఇంత హైరానా పడిపోతున్నాడు? అనే విషయాన్ని బలంగా చెప్పలేకపోతున్నాడు. చివరికి… ఉదాత్తమైన నాన్న పాత్రనే విలన్‌గా బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. పతాక సన్నివేశాలు బాగుండడంతో ఆ లోటుపాట్లు కూడా వదిలేయవచ్చు.
అప్రస్తుతమైనా త్రీ ఈడియట్స్ కథని ఓసారి గుర్తు చేసుకుందాం. అక్కడా చెప్పింది ఇదే మేటర్. ‘బిడ్డలకు ఏది ఇష్టమో అది నేర్పండి. వాళ్లని మార్కులు సంపాదించే రోబోలుగా చూడొద్దు’ అన్నది పాయింట్. కానీ దాన్ని ఎంత గొప్పగా చూపించాడు? ఎంతగా హృదయాన్ని మెలిపెట్టాడు? ఎన్ని తీక్షణమైన ఆలోచనల్లో పడేశాడు..? అంత తీక్షణత.. అంత ఉద్వేగం కలిగించాల్సిన కథ ఇది. అవి.. ఎటో వెళ్లిపోయాయన్న అసంతృప్తి కలిగితే అది ప్రేక్షకుడి తప్పు కాదు. `నాన్నా.. డబ్బు సంపాదించడం జీవితం కాదు.. తమకు నచ్చిన పని సంతోషంగా చేసుకోవడంలోనే ఆనందం ఉంది` అని పతాక సన్నివేశాల్లో హీరో చెప్పే మాటలకు తండ్రి కరిగిపోతాడు. ఈ మాత్రం డైలాగ్ మొదటి సీన్లోనే ఎందుకు చెప్పలేదు? అనే డౌట్ వస్తే… అది ప్రేక్షకుడి నేరం కాదు. పర్సనాలిటీ డెవలెప్ మెంట్, జీవితంలో సెటిల్మెంట్ అనే పదాల్ని ప్రశ్నించిన సినిమా తెలుగులో ఇంత వరకూ రాలేదు. ఆ ప్రయత్నం మంచిది. దాన్ని మరింత ప్రభావవంతంగా చెప్పే అవకాశం వచ్చినా దర్శకుడు వాడుకోలేదన్న నిరాశతో థియేటర్ల లోంచి బయటపడతాడు ప్రేక్షకుడు.
నటీనటులు
శ్రీ విష్ణు ప్రతిభావంతమైన నటుడన్న సంగతి మరోసారి బంగారం ఫ్రేము కట్టి మరీ చూపించింది సాగర్ పాత్ర. ఇందులో శ్రీ విష్ణు బాగా నటించాడు అని రాస్తే.. మరీ చిన్నదైపోతుంది. ఆ మాట మామూలుగా ఉంటుంది. శ్రీ విష్ణు తప్ప మరెవ్వరూ చేయలేరన్నంత బాగా చేశాడు. ఆ తరవాత.. మార్కులు దేవి ప్రసాద్‌కి పడతాయి. ఇలాంటి నాన్న ప్రతీ ఇంట్లోనూ ఉంటాడే అన్నంత సహజంగా కనిపించాడు. ఈ దర్శకుడిలో ఇంత ప్రతిభ ఉందా? అనిపించాడు. మన నాన్నని రూపం మార్చి.. ఆ ఇంట్లో ప్రతిష్టించారా? అని ప్రతీ అత్తెసరు మార్కుల కుర్రాడికీ అనిపిస్తుంది. వీళ్లతో పోలిస్తే మిగిలిన పాత్రలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి గానీ, వాళ్లూ చక్కగా రాణించారు.
సాంకేతిక వర్గం
వేణు ఉడుగుల తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి కథని ఎంచుకోవడం నిజంగా సాహసం. అతని ప్రయత్నంలో నిజాయతీ కనిపించింది. ప్రారంభ సన్నివేశాలు, ప్రేక్షకుడ్ని కథలోకి తీసుకెళ్లడం ఇవన్నీ బాగున్నాయి. పర్సనాలిటీ డెవలెప్మెంట్ క్లాసులపై, ఆయా పుస్తకాలపై ఓవిధంగా దర్శకుడు యుద్ధం ప్రకటించాడు. ఇలాంటి పాయింట్లు సూటిగా, గుండెల్లో గునపాల్లా గుచ్చుకుపోయేలా తెరకెక్కించాలి. ఆ విషయంలో మాత్రం అంత పదును చూపించలేకపోయాడు. చాలా చోట్ల దర్శకుడు మెరిశాడు. ఇంకొన్ని చోట్ల.. ‘ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేదే’ అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఎమోషన్స్ ని టచ్ చేశాడు. సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగున్నాయి. సాహితీ విలువలు కనిపించాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. అయితే.. కొన్ని చోట్ల అవసరానికి మించిన మెలో డ్రామా సృష్టించడానికి పదే పదే ఒకే రకమైన ఆర్.ఆర్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఫీల్ అవుతున్న సీన్లలో.
తీర్పు
నువ్వు ఇలా బతుకు… ఇలా బతికితేనే బతుకు.. అని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎవడి జీవితం వాడిది? ఎవడి సంతోషం వాడిది. నీకు ఎక్కడ సంతోషం ఉందో, ఎందులో సంతోషం ఉందో అదే చేయ్… అని చెప్పిన మరో సినిమా ఇది. కథానాయకుడిగా శ్రీవిష్ణు, నాన్న పాత్రలో దేవి ప్రసాద్ నటన, దర్శకుడి ప్రతిభ… ఇవన్నీ నూటికి నూరుపాళ్లు ఆవిష్కరించిన సినిమా ఇది. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత సంపాదిస్తుందో తెలీదు గాని.. ఈ సినిమా చూశాక కచ్చితంగా ఓ చర్చ మాత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్ర బృందం లక్ష్యం అదే కాబట్టి… గోల్ రీచ్ అయినట్టే.
ఫినిషింగ్ టచ్: పర్సనాలిటీ డెవలెప్ మెంట్ క్లాసులకే… ఓ క్లాసు!
తెలుగు360.కామ్ రేటింగ్ : 3.5/5