‘ఆపరేషన్ గరుడ’… ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతున్న టాపిక్ ఇది. ఆంధ్రాలో చంద్రబాబు సర్కారును నిర్వీర్యం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసిందనీ, గత కొన్ని నెలలుగా దాన్ని అమలు చేస్తోందనే కథనాలు గుప్పుమంటున్నాయి. రాజకీయ అనిశ్చితి సృష్టించమే లక్ష్యంగా ఆంధ్రా విషయంలో గత కొన్ని నెలలుగా భాజపా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందనీ, ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, బడ్జెట్ లో అరకొర కేటాయింపులు, విభజన హామీలపై మొండి వైఖరీ… ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్ర అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో జనసేన అధనేత పవన్ కల్యాణ్, విపక్ష నేత జగన్ ను కూడ భాజపా వాడేసుకుంటోందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ కుట్ర ఏంటంటే.. ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాలనుకుంటున్నారు కదా. సరిగ్గా ఆ సమయంలోనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం, ఇదే సమయంలో మూకుమ్మడిగా వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఈ పరిస్థితులపై చంద్రబాబు దృష్టి సారించలేని విధంగా ఆయనపై, లేదా ఆయన కుమారుడు లోకేష్ పై కేసులు పెట్టడం, శాంతి భద్రతలు అదుపులో లేవన్న కారణాన్ని భూతద్దంలో చూపించి రాష్ట్రపతి పాలన పేరుతో ఆంధ్రాను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం.. ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న భాజపా కుట్ర ఇదే అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో గుసగుస ఏంటంటే… ఆపరేషన్ గరుడలో గవర్నర్ నరసింహన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని..! ఆంధ్రా తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆయనే ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటారు. అందుకే ఆయన్ని మరోసారి భాజపా సర్కారు కొనసాగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పవన్ కల్యాణ్, జగన్ లు కూడా నరసింహన్ తో ఈ మధ్య బాగానే టచ్ లో ఉంటున్నారనీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు నరసింహన్ ను వ్యతిరేకిస్తున్నా… ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఆయనకి కొంత ఉందనీ, అందుకే భాజపా ఆయన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయమూ ఉంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో ఆపరేషన్ గరుడ పేరుతో ఆంధ్రాలో కలకలం సృష్టించాలన్నది భాజపా ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది.
దేశంలో అన్ని రాష్ట్రాలూ తమ గుప్పిట్లో ఉండాలనే అధికార యావ భాజపాకి ఎక్కువైందనే విషయం అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని త్రిపుర వరకూ ఆ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు చూస్తే అర్థమౌతుంది. అయితే, దక్షిణాది విషయానికొస్తే… కర్ణాటకలో వారికి అనుకూలంగా పరిస్థితుల లేవు. తమిళనాడులో భాజపాపై తమిళులు వ్యతిరేకంగా ఉన్నారు. కేరళలో ప్రస్తుతానికి అవకాశం లేదు. ఇక మిగిలినవి తెలుగు రాష్ట్రాలు. అందుకే, ముందుగా ఆంధ్రా నుంచి ఆపరేషన్ మొదలుపెట్టాలన్నది భాజపా వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఈ కుట్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసిందనీ, అందుకే అప్రమత్తమై భాజపాతో పొత్తు తెంచుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయం కేసీఆర్ కి కూడా తెలిసిందనీ, అందుకే ఆయన కూడా మూడో ఫ్రెంట్ అంటూ కేంద్రంపై ఎదురుదాడికి దిగారనీ వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం భాజపా దృష్టంతా ఆంధ్రా మీద ఉందనీ, ఎలాగైనాసరే చంద్రబాబు సర్కారును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే చాపకింద నీరులా కొన్ని నెలలుగా భాజపా నిర్లక్ష్యంగా ఉంటోందనే అభిప్రాయాలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయం అవుతోంది. ఆంధ్రాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టీ చూసుకుంటే.. ఈ కథనాలను పూర్తిగా కొట్టి పారేసే పరిస్థితి లేనట్టుగానే ఉంది.