హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయి ఘటనగా మారిపోవటం, దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతుండటంతో అన్ని పార్టీల నాయకులూ హైదరాబాద్ వచ్చి దళిత విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. నిన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ యూనివర్సిటీని సందర్శించారు. ఇవాళ సీపీఎమ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎమ్ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి, దళిత మేధావి కంచె ఐలయ్య, ఆప్ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇవాళ హైదరాబాద్ రాబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్ వచ్చి రోహిత్ సహచరులకు సంఘీభావం ప్రకటించబోతున్నారు. రేపు కేజ్రీవాల్ హైదరాబాద్ వెళతారని ఆఫ్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఇవాళ ఢిల్లీలో చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిన్న జంతర్ మంతర్ వద్ద ఇదే విషయంపై ధర్నా నిర్వహించారు… కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ కూడా నిన్న ట్విట్టర్లో దీనిపై స్పందించారు.