ఆర్.ఆర్.ఆర్…. అటు మెగా, ఇటు నందమూరి అభిమానుల్ని మూకమ్మడిగా తనవైపుకు లాక్కున్న సినిమా ఇది. రాజమౌళి దర్శకత్వంలో, రామ్‌చరణ్, రామారావు (ఎన్టీఆర్) కథానాయకులుగా ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే.. రాజమౌళి కూడా ఓ అధికారిక ముద్ర వేసి, టీజర్‌లాంటిది వదిలాడు. చరణ్, ఎన్టీఆర్‌లు ఫొటో షూట్ కోసం అమెరికా వెళ్లొచ్చారు. ఈ సినిమాకి అంతా సిద్ధమైపోయిందనుకుంటున్న తరుణంలో రామ్ చరణ్ ఓ బాంబులాంటి వార్త పేల్చాడు. ఈ సినిమా కోసం ఇంకా కథ సిద్ధం కాలేదట. అసలు రాజమౌళి తమకు కథే చెప్పలేదని, కేవలం రాజమౌళి మీద నమ్మకంతో, గౌరవంతో కథ వినకుండానే ఈ సినిమా ఒప్పుకున్నట్టు రామ్ చరణ్ చెబుతున్నాడు.
”అవును.. ఈ సినిమా కోసం కథ ఇంకా సిద్ధం కాలేదు. త్వరలోనే నాకు కథ చెబుతానన్నారు. ఆయన కథలు బలంగా ఉంటాయి. కాంబినేషన్ కూడా బాగుంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా” అని తేల్చేశాడు రామ్‌చరణ్. అంటే ఇప్పటి వరకూ ఈ సినిమాపై వస్తున్న కబుర్లన్నీ గాలివార్తలే అన్నమాట. ఈ కథ ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతోంది… అంటూ రాసిన వార్తలన్నీ కాకమ్మ కబుర్లే అన్నమాట. అయితే ఒకటే సందేహం.. కథేంటో తెలియకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోల్ని డిసైడ్ చేసి, వాళ్ల పేర్లు ప్రకటించేశాడంటే.. కథ లేకుండా ఎలా ఉంటుంది? ఓ లైన్‌గా చరణ్, ఎన్టీఆర్లకు చెప్పేసి.. ఇప్పుడు కథ వండడంలో బిజీగా ఉండుంటాడు. రాజమౌళి కాబట్టి ఇద్దరు స్టార్ హీరోలకు ఇలా కథ చెప్పకుండా ఒప్పించగలిగాడు. అది మిగిలిన వాళ్లకు సాధ్యమా…??