ఈ వేసవంతా సినిమాల సందడే. రామ్‌చరణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాగార్జున, నాని, నితిన్… ఇలా చాలామంది హీరోలు వినోదాలతో సందడి చేయబోతున్నారు. గత యేడాదితో పోలిస్తే ఈసారి.. వేసవిలో సినిమాల హడావుడి ఎక్కువే కనిపిస్తోంది. ప్రతీ సినిమాకీ ఓ సెపరేట్ బజ్ ఉండడం, మార్కెట్ వర్గాల పరంగా క్రేజ్ నెలకొనడం ఇవన్నీ మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. సినిమాలకు సంబంధించి వేసవి గొప్ప సీజన్. కాలేజీలకు సెలవలు ప్రకటించే కాలం ఇది. కుర్రాళ్లంతా ఖాళీగా ఉంటారు. వాళ్లని ఈజీగా థియేటర్లకు రప్పించొచ్చు. సినిమాలకు మహారాజపోషకులు యువతరమే కాబట్టి… బండి సాఫీగా నడిచిపోతుంది.
అయితే ఈ వేసవి సమరం అంతే తేలిక కాదు. ఎందుకంటే బాక్సాఫీసు దగ్గర పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. వారం వారం ఓ సినిమా వచ్చిపడిపోతుంది. ఓ సినిమా గురించి మాట్లాడుకునేలోపే మరో సినిమా.. ఆ వెంటనే మరో సినిమా… ఇలా గుక్కతిప్పుకోని వినోదాలకు వేసవి కేరాఫ్ కానుంది. సినిమా బాగున్నా, లేకున్నా… థియేటర్లో కనిపించేది వారమే. ఓ మోస్తరు సినిమాల్ని జనం ఈజీగా పక్కన పెట్టేస్తారు. గత వారం ఎం.ఎల్.ఏ విడుదలైంది. సినిమా మరీ అంత గొప్పగా లేకపోయినా, బీసీలో చల్తా. అదే మామూలు సీజన్లో అయితే కొన్ని రోజులు బాక్సాఫీసు దగ్గర నిలబడేదే. కానీ.. ఇప్పుడు అలా కాదు. 30న రంగస్థలం వచ్చేస్తోంది. రంగస్థలం సినిమా బాగున్నా దానికీ గ్యారెంటీ ఉండదు. ఆ మరుసటి వారమే నితిన్ ఛల్ మోహన్ రంగ రెడీ అపోతుంది. వారానికి ఓ సినిమా విడుదల కావడం సినీ అభిమానుల పరంగా మంచిదే కావొచ్చు. కానీ బాగున్న సినిమాలకు ఇబ్బంది. ఎంత చేసుకున్నా వారం లోపే క్యాష్ చేసుకోవాలి. సినిమా యావరేజ్‌గా ఉంటే.. దాని గురించి అస్సలు పట్టించుకోరు జనాలు. ఎందుకంటే బాక్సాఫీసు ముందు ఆప్షన్లు ఎక్కువగా ఉండే కాలమిది. పెద్ద సినిమాలకు కావల్సినంత స్థాయిలో థియేటర్లు దొరుకుతాయి… కానీ స్పాన్ చాలా తక్కువ. సినిమా కాస్త అటూ ఇటుగా ఉన్నా – మరుసటి వారానికి మర్చిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. చిన్న సినిమాలకు ఏమాత్రం గ్యాప్ దొరకదు. పెద్ద సినిమాలతో పోటీ పడలేని ఓ మాదిరి సినిమాలు ఇప్పుడు విడుదలకు దూరం అవుతున్నాయి.