ఎంపీల రాజీనామాలకి సంబంధించి ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే పరిస్థితులు లోక్ సభలో కనిపించడం లేదు. ఒకవేళ, అవిశ్వాస తీర్మానంపై చర్చ లేకుండానే లోక్ సభ నిరవదికంగా వాయిదా పడితే.. వెంటనే ఎంపీలు రాజీనామాలు చేయాలనే నిర్ణయాన్ని జగన్ సమక్షంలో జరిగిన సమావేశంలో వైకాపా నేతలు తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక రెండు వ్యూహాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మొదటిది… క్రెడిట్ కోసం పాకులాట! అంటే, ఏపీ రాష్ట్ర ప్రయోజనాల అంశమై అవిశ్వాస తీర్మానాన్ని మొదట వైకాపా ప్రవేశపెట్టింది. ఆ వెంటనే టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. టీడీపీకి ఉన్న అనుభవం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల ప్రముఖ నేతలతో ఉన్న సఖ్యత నేపథ్యంలో టీడీపీ పెట్టిన తీర్మానానికి అనూహ్య మద్దతు ఇచ్చింది. దీంతో తమకు ఆశించిన స్థాయి ప్రచారం దక్కలేదని జగన్ ఆలోచించారట! అవిశ్వాసం ముందుగా మనం పెట్టినా, తరువాత వచ్చిన టీడీపీకే ఎక్కువ స్పందన వస్తోందని వైకాపా నేతలు విశ్లేషించుకున్నారట. అందుకే, ఇప్పుడు సభ నిరవదికంగా వాయిదా పడిన మరుక్షణమే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే.. తమ దారిలోనే టీడీపీ ఎంపీలు నడవాల్సి వస్తుందని భావిస్తున్నారట.
ఇక, రెండవది… హోదా పోరాటం గురించి ప్రచారం! అంటే, కేంద్రమంత్రి వర్గంలోని తెలుగుదేశం మంత్రుల రాజీనామా, అనంతరం ఎన్డీయేతో భాగస్వామ్యం తెంచుకోవడం… ఈ నిర్ణయాలతో ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి బాగా వెళ్లింది. నాలుగేళ్లుగా తాము పోరాడుతున్నా ఆ స్థాయి స్పందన తెచ్చుకోలేకపోయామన్న అభిప్రాయమూ కొంతమంది వైకాపా నేతల్లో ఉందట! అందుకే, అవిశ్వాసం చర్చకు రాకుండా లోక్ సభ వాయిదా పడితే.. వైకాపా ఎంపీలు వెంటనే రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లాలన్నది వ్యూహం. ‘ప్రత్యేక హోదా కోసం ఇదిగో మేం రాజీనామాలు చేశాం, మా చిత్తశుద్ధి ఇదీ, ఇచ్చినమాటకు కట్టుబడి చివరి అస్త్రంగా తృణప్రాయంగా పదవులు వదులుకున్నాం’ అని ప్రచారం చేయడం కూడా వైకాపా వ్యూహంగా తెలుస్తోంది.
విచిత్రం ఏంటంటే.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడకుండా, చంద్రబాబుపై విమర్శలు చేస్తారు! ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై భాజపా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, దానికి నిరసనగా ఎంపీలు రాజీనామాలు చేసి.. అప్పుడూ చంద్రబాబు వ్యతిరేకంగానే పోరాటం చేయాలని అనుకుంటున్నారు! ఇంతటి విచిత్రమైన విపక్షం ఎక్కడైనా ఉంటుందా..?