పాపం.. నాగార్జున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అఖిల్‌కి ఓ హిట్టు ఇవ్వలేకపోయాడు. తొలి సినిమాని వినాయక్ చేతిలో పెట్టాడు. రెండో సినిమాని.. విక్రమ్ కె.కుమార్‌ని తీసుకొచ్చాడు. కానీ హిట్టేది? ‘హలో’పై నాగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆసినిమాకి చేయాల్సిందంతా చేశాడు. ఆ మాటకొస్తే… చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. కానీ. చివరికి ఏమైంది? హలో సినిమాని మర్చిపోవడానికి నాగ్‌కీ, అఖిల్‌కీ కొంత సమయం పట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనుభవాన్ని కాదు, టాలెంట్‌నీ, కథనీ నమ్ముకోవాలనే ఉద్దేశంతో.. వెంకీ అట్లూరికి అవకాశం ఇచ్చారు.
మళ్లీ నాగ్ టెన్షన్ మొదలైనట్టుంది. ఇప్పటికే కథ ఓకే చేసేశాడు నాగ్. స్క్రిప్టు పూర్తి అవ్వగానే.. మరో రీడింగ్ ఉంటుంది. అక్కడే నాగ్ అసలు కష్టం మొదలవుతుంది. తన డౌట్లు కొన్ని ఇప్పటికే వెంకీతో షేర్ చేసుకున్నాడట. ఈ సినిమాకి నాగ్ నిర్మాత కాదు.. కానీ నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం నాగ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. నాగ్ సూచనల మేరకే.. తమన్ ఈ టీమ్‌లో వచ్చి చేరాడని సమాచారం. కథానాయిక విషయంలోనూ నాగ్‌దే అంతిమ నిర్ణయం. అందుకే బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా ఈ బాధ్యతలన్నీ నాగ్ కి అప్పగించి రిలాక్స్ అయిపోయాడట. వర్మతో తెరకెక్కిస్తున్న ‘ఆఫీసర్’ సినిమా పూర్తి కావొచ్చింది. ఆ సినిమా అవ్వగానే.. అఖిల్ సినిమాపై నాగ్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించబోతున్నాడు.