సినిమా తారలకు, అభిమాన ప్రేక్షకులకు అనుసంధాన వేదిక సోషల్ మీడియా. అంబికా దర్బార్ బత్తి అగరబత్తి టైపులో. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు… ఆల్మోస్ట్ అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వున్నారు. ఒక్క రామ్‌చరణ్ తప్ప. ఆయన ఫేస్బుక్లో వున్నారు కాని… అకౌంట్ వేరేవాళ్లు మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ చరణ్‌కి పోస్టు చేయాల్సిన విషయాలు చెబితే… వాళ్ళు పోస్టులు చేస్తారు. మ్యాగ్జిమమ్ చరణ్‌కి సంబంధించిన విషయాలను ఆయన సతీమణి ఉపాసన ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మరి, అభిమానుల స్పందన చరణ్ ఎలా తెలుసుకుంటాడు? పుట్టినరోజు సందర్భంగా పత్రికలవారికి ఇచ్చిన ఇంటర్వ్యూలలో చరణ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు. ఆయనకు సోషల్ మీడియాలో సీక్రెట్ అకౌంట్ ఉందన్నారు. ఇప్పటివరకూ ఉపాసనకూ ఆ సంగతి తెలియదన్నారు. ఆ అకౌంట్ ద్వారా ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకుంటారట. ఈ సీక్రెట్ మిషన్స్ ఎందుకో మరి? అలాగే, శుక్రవారం ‘రంగస్థలం’ విడుదల సందర్భంగా చరణ్ చెప్పిన సంగతులు…
‘రంగస్థలం’లో చిట్టిబాబు లాంటి పాత్ర నేనెప్పుడూ చేయలేదు. భవిష్యత్తులో చేయలేను కూడా. నటుడిగా ఈ పాత్ర నాకు చాలా పరీక్షలు పెట్టింది. ముఖ్యంగా సిటీలో పెరిగిన నాకు పల్లెటూరి వాతావరణం అలవాటు లేదు. గోదావరి యాసలో ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి నేను గోదావరి యాసలో మాట్లాడి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకోసం ప్రత్యేకంగా నలుగురు ట్యూటర్స్‌ని పెట్టుకున్నా.
నటుడిగా, వ్యక్తిగతంగా నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన సినిమా ‘రంగస్థలం’. దర్శకుడు సుకుమార్, డీఓపీ రత్నవేలు లేకపోతే ఈ సినిమా చేసేవాణ్ణి కాదు. వాళ్లిద్దరూ నాకెంతో మద్దతు ఇచ్చారు. వినికిడి లోపం వున్న పాత్ర చేయగలననే ధైర్యాన్నిచ్చారు. సుకుమార్ నన్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనడం విన్నాను. కాని సుక్కు నాతో ఆరేడు టేకులు తీసుకునేవాడు. ఎడిట్ రూమ్‌లో మాత్రం ఫస్ట్ టేకే వాడాడని అనుకుంటున్నా.
ఐదారేళ్ళ క్రితం ఇటువంటి కథ వస్తే చేసేవాణ్ణి కాదేమో. ‘బ్రూస్లీ’ తరవాత నా మైండ్ సెట్ మారింది. ఆ మార్పులోంచే ‘ధృవ’, ఇప్పుడీ ‘రంగస్థలం’ వచ్చాయి. దేనికైనా సరైన సమయం రావాలి.
ఇటీవల మంచి చిత్రాల్ని, కమర్షియల్ చిత్రాల్ని వేర్వేరుగా చూస్తున్నాం. నాన్నగారు ప్రేక్షకులతో పాటు విమర్శకుల్ని మెప్పించిన ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ వంటి చిత్రాలు చేశారు. మా తరానికి అలాంటి అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయి. ‘రంగస్థలం’ మాత్రం ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని ఆకట్టుకునే చిత్రమే.
‘రంగస్థలం’ షూటింగ్ కోసమని పాపికొండలు వెళ్ళినప్పుడు ఉపాసన వచ్చింది. కొన్ని రోజులు ఇద్దరమూ అక్కడే వున్నాము. ఇప్పుడు అదే మా ఫేవరెట్ హాలిడే స్పాట్ అయ్యింది. నేను ఎంత బిజీగా తను అర్థం చేసుకుంటుంది. నన్ను డిస్టర్బ్ చేయదు.
నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నాన్నగారూ అంతే. ఇంట్లో వుంటే మనవరాళ్లతో ఆడుకుంటారు. ఎక్కడికీ వెళ్లరు. ఇక, ‘మీరు ఎప్పుడు తండ్రి కాబోతున్నారు?’ అని అడిగితే… “త్వరలో. అలాంటి విశేషం ఉంటే అందరికి తెలుస్తుంది. దాచుకోవడానికి ఏమీ లేదు. దేనికైనా సరైన సమయం రావాలి” అన్నారు.
కల్యాణ్ బాబాయ్(పవన్ కల్యాణ్)కి నాన్నగారు (చిరంజీవి) అంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమను తమ్ముడికి నాన్నగారి పేరు పెట్టడం ద్వారా చూపించారు. ఈ సంగతి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. మా ఫ్యామిలీలో అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.