చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య అడ్డుగోడలున్నాయని, ఇద్దరి సిద్దాంతాలూ వేరని, అందుకే విడివిడిగా ఉంటున్నారని… ఇలా చాలా చాలా కబుర్లు చెప్పుకుంటుంటారు బయటివాళ్లు. చూడ్డానికి మాత్రం వీరిద్దరి మధ్య సీన్ అలానే ఉంటుంది. కానీ అంతిమంగా వారిద్దరూ మెగా బ్రదర్స్. ఈ విషయం వీలున్నప్పుడల్లా నిరూపితం అవుతూనే ఉంది. ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో చిరు హడావుడి చేశాడు. బ్రూస్లీ విడుదల సమయంలో పవన్ వెళ్లి చిరంజీవిని కలిసి వచ్చాడు. ఇప్పుడూ అలాంటి సీనే కనిపించింది. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ చిరు ఇంటికి వెళ్లాడు. అన్నా వదినలతో కలసి భోజనం చేసి వచ్చాడు. ‘మెగా బ్రదర్స్ కలిసిపోయారోచ్’ అంటూ ఫ్యాన్స్ ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.
ఒక విధంగా ఇదో మైండ్ స్ట్రేటజీ. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు.. చరణ్ సినిమా విడుదల సమయంలో కనిపిస్తుంటాయి. ‘చరణ్ కూడా మనవాడే’ అని పవన్ ఫ్యాన్స్ సైతం అనుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తెలిసి చేస్తారో, తెలియకుండా చేస్తారో గానీ… కావాల్సిన సమయంలో ఇలాంటి ములాఖాత్ లు దర్శనమిస్తాయి. పవన్ మనసులో ఏం ఉంటుందో గానీ.. చరణ్‌కి మాత్రం ఈ ములాఖాత్, ఈ సమయంలో ప్లస్సే అవుతుంది. పవన్ రాకతో.. చరణ్‌కి అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ దొరికేసినట్టే.