పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిపై విచారణ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ, నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ. ఉన్నతాధికారులతో కూడిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఉన్నతాధికారుల బృందం భారత్ అనుమతిస్తే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో కూడా పర్యటించి, దర్యాప్తు చేసి ఆధారాలు సేకరిస్తామని చెప్పింది. మొదట భారత్ అందుకు సానుకూలంగా స్పందించింది. ఎందుకంటే పాకిస్తాన్ కి చెందిన సిట్ బృందం భారత్ పర్యటించడానికి అనుమతించడం ద్వారా ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లవుతుంది. ఒకవేళ అనుమతించకపోతే ఈ విషయంలో పాకిస్తాన్ నిజాయితీ వ్యహరిస్తునప్పటికీ భారత్ దర్యాప్తుకు సహకరించడం లేదని ప్రచారం చేసుకొనే అవకాశం పాకిస్తాన్ కి లభిస్తుంది.
అందుకే పాక్ సిట్ బృందం పఠాన్ కోట్ లో పర్యటించాలనుకొంటున్నట్లు ప్రకటించగానే విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ దానిని స్వాగతించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న భారత నిఘా వర్గాలు, అధికారులు అద్నరూ పాక్ సిట్ బృందానికి అన్నివిధాలా సహకరిస్తారని ఆయన తెలిపారు. కానీ ఆ తరువాత భారత్ తన నిర్ణయంపై పునరాలోచన చేసింది. భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ ఐ.ఎస్.ఐ. అధికారులతో కూడిన సిట్ బృందాన్ని పఠాన్ కోట్ వంటి అత్యంత కీలకమయిన వాయుసేన స్థావరంలోకి అనుమతించినట్లయితే దాని గురించి వారికి మరింత అవగాహన కల్పించినట్లవుతుందని భావించడంతో భారత్ మనసు మార్చుకొంది.
రక్షణశాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పఠాన్ కోట్ పై దాడి జరిగిన తరువాత దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ దాడికి పాల్పడినవారి వివరాలు ఇప్పటికే మేము పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేసాము. కనుక దానిపై దర్యాప్తు జరిపి ఈ దాడికి బాధ్యులయిన వారిని భారత్ కి అప్పగించవలసిన బాధ్యత దానిపైనే ఉంది. దీనిపై దర్యాప్తు కోసం అది ఏర్పాటు చేసిన సిట్ బృందాన్ని పఠాన్ కోట్ లో పర్యటించేందుకు అనుమతించబోము,” అని విస్పష్టంగా ప్రకటించారు.
అయితే సిట్ బృందం పాక్ లో తన దర్యాప్తును పూర్తి చేసి ఈ దాడికి పాల్పడినవారి గురించి పూర్తి ఆధారాలు, వివరాలు సేకరించినట్లయితే వారిని డిల్లీ రావడానికి అనుమతించాలని హోం శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూర్ మహమ్మద్ అరెస్ట్ విషయంలో పాక్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాక్ మళ్ళీ మాట మార్చింది.
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నిన్న పాక్ మీడియాతో మాట్లాడుతూ “జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూర్ మహమ్మద్ ని నిర్బంధించలేదని వస్తున్న వార్తలలో నిజం లేదు. అతనిని గృహ నిర్బంధంలో ఉంచి ప్రశ్నిస్తున్నాము. కానీ ఇంతవరకు అతని దగ్గర నుండి పఠాన్ కోట్ దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు,” అని తెలిపారు.
వీటిని బట్టి భారత్, పాక్ ప్రభుత్వాలు రెండూ కూడా పఠాన్ కోట్ విషయంలో నిర్దిష్టంగా వ్యవహరించలేకపోతున్నాయని స్పష్టం అవుతోంది. మసూర్ మహమ్మద్ అరెస్ట్ విషయంలో పాక్ రోజుకొక మాట మార్చుతుంటే, ఇస్లామాబాద్ లో జరుగవలసిన విదేశాంగ కార్యదర్శుల సమావేశం విషయంలో, పాక్ సిట్ బృందాన్ని పఠాన్ కోట్ లోకి అనుమతించే విషయంలో భారత్ కొంచెం అయోమయంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ దాడి జరిగి ఇప్పటికి సుమారు మూడు వారాలు కావస్తోంది. కానీ రెండు దేశాలు నిర్దిష్టంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చును.