రాంగోపాల్ వర్మ మరో బంపర్ ఆఫర్ పట్టేశాడు. ఫ్లాపుల్లో ఉన్నా కూడా… నాగార్జునని ఒప్పించి `ఆఫీసర్` అనే సినిమా తీస్తున్నాడిప్పుడు. ఆ సినిమా పూర్తి కాకుండానే నాగార్జునని మరోసారి తన మాయలో పడేశాడు. ఈసారి అఖిల్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. వర్మ – అఖిల్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ సెట్టవుతుందా? అంత ఛాన్సు లేదు.. అనేది అందరి నమ్మకం. కానీ దాన్ని బద్దలు కొడుతూ.. అఖిల్ సినిమా పట్టేశాడు వర్మ. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్లో ధృవీకరించాడు. అఖిల్‌తో సినిమా చేస్తున్నానంటూ సగర్వంగా ప్రకటించాడు. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
పాతికేళ్ల క్రితం నాగ్ నిర్మాతగా తనకు తొలి అవకాశం ఇచ్చాడని, ఇప్పుడు నాగ్‌తో మరో సినిమా చేస్తున్నానని, ఈలోగా అఖిల్ సినిమానీ అందుకొని ఓ సర్కిల్ పూర్తి చేయగలిగానని సంతోషంగా ట్వీట్ చేశాడు వర్మ. సోమవారం అఖిల్ మూడో సినిమాకి క్లాప్ పడింది. ఇంతలోనే నాలుగో సినిమా ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వెంకీ అట్లూరి సినిమా పూర్తయ్యాకే… అఖిల్ – వర్మల కాంబో పట్టాలెక్కుతుంది. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్‌లో మరో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వర్మ. అప్పుడు నాగ్‌తో అయితే, ఇప్పుడు తనయుడితో.