తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాంపుల గోల ఎక్కువ. అభిమానులపై మాత్రమే కాదు… నిర్మాతలపైనా ఫలానా క్యాంపు మనిషిగా ముద్ర వేస్తారు. ఒక్కసారి ఓ క్యాంపు ముద్ర పడిన తర్వాత దాన్ని చెరిపేసుకుని మరో క్యాంపు హీరోతో సినిమా చేయడం కష్టమైన పని. మెగా క్యాంపులో హీరోలు ఎక్కువ. అందుకని కొందరు నిర్మాతలు మెగా క్యాంపు మనిషిగా ముద్ర పడినా పట్టించుకోరు. అరడజను మంది మెగా హీరోల్లో ఎవరో ఒకరితో సినిమా చేయొచ్చని ధీమా వారిది. కొంతమంది నిర్మాతలు నందమూరి క్యాంపులో నిర్మాతలు బాలకృష్ణతో వరుసగా సినిమాలు తీస్తుంటారు. రాజకీయంగా తెలుగుదేశానికి మద్దతు తెలుపుతారు. వీటన్నిటికీ అతీతంగా కొందరు నిర్మాతలు అందరి హీరోలతోనూ సినిమాలు చేస్తుంటారు. దిల్ రాజు టైపులో.
అటువంటి ప్రొడ్యూసర్ ఇమేజ్ కోసం నిర్మాత సి. కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా విడుదలైన ‘జై సింహ’తో పాటు, తర్వాత నెలలో వచ్చిన సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ సినిమాలకు ఆయనే నిర్మాత. నందమూరి బాలకృష్ణ సినిమా హిట్ అయితే… మెగా మేనల్లుడి సినిమా ఫట్ అయ్యింది. ఫలితాలు పక్కన పెడితే.. తనపై ఎలాంటి ముద్ర పడకుండా రెండు సినిమాలను విడుదల చేసిన ఘనత కల్యాణ్‌కి దక్కింది. రెండు క్యాంపులతోనూ సఖ్యతగా వున్నారు. ఇప్పుడు సేమ్ ‘నందమూరి-మెగా’ స్ట్రాటజీతో సినిమాలు చేయడానికి సి. కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క బాలకృష్ణ-వినాయక్ కాంబినేషన్ కలపడానికి ట్రై చేస్తూ… మరో పక్క అల్లు అర్జున్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సినిమా తీయడానికి పావులు కాపుతున్నారు. బన్నీకి దర్శకుడితో కథ కూడా చెప్పించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ సినిమా, వేసవికి అల్లు అర్జున్ సినిమా విడుదల చేయాలని ప్లాన్స్ రెడీ చేశారట.