మీడియా తొందరపాటుకి మరో ఉదాహరణ ఇది. సీనియర్ నటి జయంతి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరణించారని మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఓ వార్త చక్కర్లు కొట్టింది. టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లు వేశారు. స్టోరీలూ వండారు. వెబ్ సైట్లలో అయితే.. జయంతి మరణంపై వార్తలు రాసేశారు. సోషల్ మీడియాలో రిప్, శ్రద్దాంజలి పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆఖరికి ఈనాడు లాంటి సంస్థ కూడా తన వెబ్ సైట్లో జయంతి మరణించిందన్న వార్త ప్రచురించింది. ఈటీవీలోనూ బ్రేకింగులు పడ్డాయి. దాంతో మిగిలిన వాళ్లు ఈనాడుని ఫాలో అయిపోయారు.
నిజానికి జయంతి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తలు చూసి జయంతి కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. టీవీ ఛానళ్లకు ఫోన్లు చేసి ‘ఆమె బాగానే ఉన్నారు. ముందు మీ వార్తలు ఆపండి’ అంటూ విన్నవించుకోవాల్సివచ్చింది. ఓ వ్యక్తి అంపశయ్యపై ఉంటే.. కోలుకోవాలని ప్రార్థించాలే తప్ప, బ్రేకుంగుల కోసం.. ముందు మనమే ఇచ్చాం అని చెప్పుకోవడం కోసం బతికున్న వ్యక్తిని ఇలా తొందరపడి చంపేయడం దేనికి? ఇదేం కొత్త కాదు. ఇది వరకు చాలామంది విషయంలో ఇలానే జరిగింది. సుధాకర్ చనిపోయాడని, శ్రీకాంత్‌కి ఏదో అయ్యిందని వార్తలు వండి పడేశారు. జయంతి విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.