టీవీ 5లో జరిగిన ఓ చర్చ, ఓ యాంకర్ మాట్లాడిన ‘చెత్త’ మాట.. చిత్రసీమని కలవరపాటుకు గురిచేసింది. దాంతో అంతా ఏకమయ్యారు. ‘ఇలాంటివి పునరావృతం చేయొద్దు’ అంటూ మీడియాని వేడుకుంటూనే హెచ్చరికలాంటిది జారీ చేశారు. టీవీ 5లో జరిగిన రచ్చ ని, ఆ యాంకర్ మాట్లాడిన బూతుని ఎవ్వరూ సమర్థించరు. అలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. చిత్రసీమ కదిలి వచ్చి – నిరసన వ్యక్తం చేయడం కూడా ఆనందాన్ని కలిగించే విషయమే. అయితే… అలీ లాంటి వాళ్లు ‘బూతులు వద్దు..’ అని చెప్పడం గురువింద నీతిని తలపిపిస్తోంది. ఆడియో ఫంక్షన్లలో అలీ నోరు విప్పితే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. పది మాటలుల మాట్లాడితే.. అందులో ఆరు బూతులుంటాయి. టీవీ షోల్లోనూ అలీ.. హద్దు దాటి మాట్లాడిన సంగతులు మర్చిపోయేంత చిన్నవి కావు. కానీ అలాంటి వ్యక్తి కూడా.. ‘ఇలాంటి ఘనట మళ్లీ జరిగితే ప్రతిఘటించడానికి మొదటి అడుగు నేను వేస్తా’ అంటుంటే.. ఆశ్చర్యం వేస్తోంది.
అలీ, చలపతిరావు బాబాయ్‌లు బూతులు మాట్లాడినప్పుడు కూడా చిత్రసీమ అంతా ముందుకొచ్చి ‘మీరు మాట్లాడింది తప్పు’ అంటే చాలా బాగుండేది. ‘ఇక మీదట… ఎవ్వరూ బూతులు మాట్లాడకుండా మేం బాధ్యత చూసుకుంటాం’ అంటే ఇంకా బాగుండేది. మీడియాలో ఎవరో ఏదో తప్పుడు కూత కూసినంత మాత్రాన మీడియా అంతటినీ ఒకే గాడిన కట్టి.. ‘మీరు మా వల్లే బతుకుతున్నారు. మా యాడ్లే కావాలి.. మా ఇంటర్వ్యూలే కావాలి’ అంటూ మీడియాపై దుమ్మొత్తి పోయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. `మీలో ఒకడు.. తప్పుగా మాట్లాడితే మీడియా ఎందుకు ఉపేక్షించింది` అనేది నిజంగా బలమైన పాయింట్. కానీ అలీ, చలపతిరావు తప్పుగా మాట్లాడినప్పుడు.. సినిమా వాళ్లేం చేశారు? వాళ్లని మందలించారా? ‘మా’ సభ్యత్వాలు రద్దు చేశారా? సినిమాలు రాకుండా అడ్డు పడ్డారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు లేవడం చాలా కామన్. వేదికలపై నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత సినిమా వాళ్లకు ఉంది. వాళ్లపై లేనిపోనివి రాయకుండా… టీఆర్పీల కోసం ఆరాటపడకుండా ఓ నిబద్దతతో పనిచేయాల్సిన బాధ్యత మీడియాకూ ఉంది.