నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’ పూజా కార్యక్రమాలతో రేపు ఉదయం హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఓపెనింగ్ కోసమే స్పెషల్ సెట్ వేశారు. మద్రాస్‌లో ఎన్టీఆర్ ఏ ఇంట్లో నివాసం వున్నారో.. సేమ్ అటువంటి సెట్ వేశారు. రిజస్టర్ ఉద్యోగం రావడంతో, అందులో చేరేందుకు ఎన్టీఆర్ తొలిసారి మద్రాస్ వెళ్లారు. తరవాత కొన్నాళ్ళు అక్కడే వున్నారు. హీరోగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటి చెన్నైలో ఆయన నివాసం వున్న సన్నివేశాలని రేపు తొలి సన్నివేశంగా తీయనున్నారు. తరవాత సినిమా కోసమూ హైదరాబాద్‌లో మద్రాస్‌ను తలపించే సెట్స్ వేయనున్నారు. ఆర్టిస్టులు అందర్నీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్లి రియల్ లొకేషన్లలో షూటింగ్ చేయడం కష్టం. అదే ఇక్కడే మద్రాస్ సెట్స్ వేయడం వల్ల చిత్రీకరణ సులభంగా చేయవచ్చనేది దర్శకుడు తేజ ఆలోచన. రేపు ప్రారంభోత్సవం అయిన తరవాత ఇతర నటీనటులు, షూటింగ్ వివరాలు ప్రకటించే అవకాశం వుంది.