కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ సైన్యాన్ని సెంట్రల్ కమాండ్ ట్రాక్ చేస్తున్నపుడు జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్విచ్చాఫ్ అయిపోయింది…
అంతరిక్షం నుంచి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ప్రపంచాన్ని చూస్తూ, అవసరమైన వారికి చూపించగల జిపిఎస్ టెక్నాలజీ అమెరికా సొంతం. ఉచితంగాకాని డబ్బు చెల్లించిగాని ఈ సర్వీసు ఎవరైనా ఉపయోగించుకునే వుంది. కారుకి నేవిగేటర్ కొనుక్కుంటే అది పెయిడ్ సర్వీసు…మొబైల్ ఫోన్ లో దారి వెతుక్కుంటే అది ఫ్రీ సర్వీసు.
సర్వీసు ఏరకమైనా దాని మీద అధికారం అమెరికాదే…ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ఛాఫ్ చేసేయొచ్చు! కార్గిల్ యుద్ధ సమయంలో (తాత్కాలికంగా) ఇదే జరిగింది. అంటే సైన్యం దారులు ఆకస్మికంగా మూసుకుపోవడమే కదా! అయినా ఫరవాలేదు. టెక్నాలజీ లేనిరోజుల్లో మాదిరిగానే సైన్యం తన తిప్పలేవో తానే పడుతుంది. ఇందులో ఒక సమస్య కూడా వుంది. ప్రత్యర్ధికి టెక్నాలజీ వుండి మనకు లేకుండా ఢీ కొట్టడమంటే చీకట్లో యుద్ధం చేయడమే కదా! అన్నిటికీ మించి జిపిఎస్ ద్వారా మన కదలికలు తెలుసుకునే అవకాశం జిపిఎస్ యజమాని అయిన అమెరికాకు దక్కింది. ఇది ఏదేశ ప్రయోజనాలకైనా ప్రయివసీలకైనా ప్రమాదకరమే!
ఈ నేపధ్యం నుంచే భారత్ సొంత లొకేషన్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. శ్రీహరి కోటలోని రాకెట్ కేంద్రం ఇప్పటికే 4 లొకేషన్ పొజిషనింగ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. ఈ రోజు (20-1-2016) తాజాగా పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఇ (ఇండియన్ రీజనల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్) ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఇలాంటివే మరో 2 శాటిలైట్లను కూడా ఈ ఏడాదే ప్రయోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే వున్న శాటిలైట్లు పని ప్రారంభించాయి. మొత్తం 7 శాటిలైట్లూ పని మొదలు పెట్టాక భారత్ కు శక్తివంతమైన పొజిషనింగ్ సిస్టమ్ రూపొందుతుంది.
సొంత సమాచార వ్యవస్ధ వల్ల సైనికావసరాల వంటి వ్యూహాత్మక ప్రయోజనాలు గోప్యంగా వుండటం మాత్రమే గాక ఈ సర్వీసును వాణిజ్య పరంగా కూడా వాడి ఖర్చు రాబట్టుకోవచ్చు.
చంద్రుడి మీద కాలు మోపిన దేశాలు కూడా కనుగొనలేకపోయిన విధంగా 2008 లో చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చిన భారత శాటిలైట్ చంద్రయాన్ 1 చంద్రుడి మీద నీరుందని ప్రపంచానికి చాటి చెప్పింది.
ఒకో శాటిలైట్ ప్రయోగానికి సగటున 600-800 కోట్లరూపాయల ఖర్చవుతుంది. భారత్ వంటి పేదదేశానికి ఇంత ఖరీదైన ప్రయోగాలు అవసరమా అని హేళన చేసిన పెద్ద దేశాలకు, కొందరు ప్రవాస భారత శాస్త్రవేత్తలకు కూడా విజయవంతమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రయోగాలే చెంపదెబ్బలాంటి సమాధానాలు!
ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సైంటిస్టులూ! జయహో!!???