‘ఆంధ్రప్రదేశ్ ప్రజల మనో భావాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అనుభవమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై నిర్లక్ష్యం చేస్తున్న భాజపాకి కూడా అదే అనుభవం తప్పదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య చాలా సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల సంగతేమోగానీ.. కేంద్రంపై ఏపీ పోరాటం మొదలుపెట్టాక… మోడీ సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది..! దాదాపు పదిరోజులు అవుతున్నా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధం కాలేకపోతోంది. ముందుగా, టీడీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యల విషయమై భాజపా తీరును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టారు. ఆ తరువాత, ఇతర పార్టీలు అనుసరించాయి. ప్రస్తుతం స్పీకర్ ముందు 8 అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఉన్నాయి. కాంగ్రెస్ తో సహా కొన్ని పార్టీలు నోటీసులు ఇచ్చేశాయి.
ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని కంటితుడుపు కామెంట్లు చేయగలుగుతున్నారుగానీ, నిజంగా చర్చకు దిగే పరిస్థితిలో మోడీ సర్కారు లేదన్నది అర్థమౌతోంది. అంతేకాదు, ఈ తీర్మానాలపై ఇలాగే నాన్చుడు వైఖరి అవలంభించి, సభను నిరవధికంగా వాయిదా వేసే ధోరణిలో ఉన్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యల్లో అర్థమౌతోంది. ఇంతకీ.. అవిశ్వాసంపై మోడీ ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు..? అంటే, చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. ఆంధ్రా ప్రయోజనాలు. ఏపీని మోడీ సర్కారు నిట్టనిలువునా నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం ఇప్పుడు జాతీయ స్థాయి అంశంగా మారిపోయింది. అవిశ్వాసంపై చర్చకు దిగితే ఇదే అంశాన్ని వేదికగా చేసుకుని తెలుగుదేశంతోపాటు ఇతర పార్టీలూ మోడీపై విమర్శలు గుప్పిస్తాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనే కంటెంట్ భాజపా దగ్గర లేదు. ఏపీకి ఎంతో చేశామంటూ గడచిన వారమంతా భాజపా నేతలు ఊదరగొట్టినా, అది పసలేని వాదన అనేది అందరికీ అర్థమైపోయింది.
సరే, ఏపీ విషయం తరువాత.. ఇతర పార్టీలన్నింటిలో కనిపించే మరో ఐక్యత.. మోడీ వ్యతిరేకత! పెద్ద నోట్ల రద్దు వైఫల్యం, జీఎస్టీ కష్టాలు, యూపీ రాజస్థాన్ లాంటి రాష్ట్రల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఫల్యం, గుజరాత్ లో తగ్గిన హవా.. ఇవన్నీ మోడీని కార్నర్ చేసే అంశాలు. వీటిపై ధీటుగా సమాధానం చెప్పే కంటెంట్ కూడా మోడీ సర్కారు దగ్గర లేదు. అన్నిటికీ మించి.. అవిశ్వాసంపై చర్చకు ఆస్కారం ఇస్తే, దీన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంటుందేమో అనే భయం కూడా కొంత ఉందనే అనిపిస్తోంది. ఇంకోపక్క, దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసం మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవిశ్వాసం చర్చ వారికీ ప్రయోజనకంగా మారుతుందేమో… మోడీపై వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఐక్యతకు వేదిక అవుతుందేమో అనే బెదురు భాజపాలో చాలా స్పష్టంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే… మిత్రపక్షమైన టీడీపీ తిరగబడం మొదలుపెట్టాక, మోడీ సర్కారు రానురానూ డిఫెన్స్ లో పడుతున్నట్టుగానే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే సభలో విమర్శలు ఉంటాయి, జరక్కపోతే భాజపా భయపడిందనే విమర్శలూ తప్పవు..! కాబట్టి, తుది నిర్ణయం ఏంటనేది భాజపా తేల్చుకోలేకపోతోంది.