భాజపా ఎంపీ జీవిఎల్ నర్సింహారావుకి ఆంధ్రా అంటే అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది..! తెలుగు ప్రజలంటే తనవారే అనేది ఇన్నాళ్లు గుర్తొచ్చినట్టుంది. ఎంపీ అయిన తరువాత ఆయన విజయవాడ వచ్చారు. స్థానిక భాజపా నేతల్ని కలుసుకున్నారు. ఆ తరువాత, ఒంగోలు వెళ్లారు. అక్కడ కూడా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే తప్ప, తన పర్యటన గురించి మీడియా ప్రముఖంగా పట్టించుకోదని అనుకున్నట్టున్నారు! ఆంధ్రప్రదేశ్ లో రెచ్చగొట్టే రాజకీయాలను చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోడీని కించపరుస్తున్నారు అన్నారు. యు.సి.లకు సంబంధించి సీఎం సరైన సమాధానాలు చెప్పలేక, ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఈయన వ్యవహారం చూస్తుంటే ఏపీ భాజపా బాధ్యతలు తనపైనే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి పదవులూ బాధ్యతలూ ఆయనకి భాజపా అప్పగించింది లేదు! అయితే, ఉన్నట్టుండీ ఈ పర్యటన ఎందుకూ అంటే… ఎంపీ పదవి వచ్చింది కాబట్టి, తాను కూడా జాతీయ స్థాయి నాయకుడినే అని ఏపీ రాజకీయ వర్గాల్లో గుర్తింపు కోసం పాకులాటలా కనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో భాజపా కూడా ఏపీలో పోటీ చేసే ధోరణిలో ఉంది. జీవీఎల్ మంచి మాటకారి కాబట్టి.. ఆయన్ని ఇప్పట్నుంచే ఆంధ్రాతో టచ్ లో ఉండాలని పార్టీ అధినాయకత్వం సూచించిందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.
అయితే, జీవీఎల్ మాట్లాడితే వినేవారు ఆంధ్రాలో ఎవరున్నారు..? ఇంతకీ ఆయన గురించి ఆంధ్రాలో ఎంతమందికి తెలుసు..? గతంలో ఆంధ్రా రాజకీయాల్లో ఉన్నారా, అంటే అదీ లేదు. వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి బాగా దగ్గరవడం ద్వారా ఆయన రాజకీయాల్లో ఎంట్రీ లభించింది. ఆ తరువాత, ‘దేశానికి మోడీ ప్రధానమంత్రి అవుతారు’ అని మొట్టమొదటిసారిగా ఈయనే బహిరంగంగా మాట్లాడారు. దాంతో మోడీ, అమిత్ షాల అభిమానం చూరగొన్నారు. ఆ విధేయత వల్లనే నేడు ఎంపీ పదవి వచ్చింది. అంతే తప్ప, ఆయన ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేయగల రాజకీయాలు ఎక్కడా చేయలేదు. ఆంధ్రాలో నాలుగు రోజులు పర్యటించినంత మాత్రాన ప్రత్యేకంగా ఆయన చేయగలిగేదీ ఏమీ ఉండదు..! జీవీఎల్ గానీ, రామ్ మాధవ్ గానీ ‘మేమూ తెలుగు వారమే’ అనే బిల్డప్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇక్కడి ప్రజల మనోభావాలు, సెంటిమెంట్స్ వారికి అర్థమయ్యే ఆస్కారమే లేదు. అర్థమైతే ఇలాంటి సందర్భంలో అర్థరహితంగా మాట్లాడి ఉండేవారూ కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటివారు కేవలం భాజపా ఉద్యోగులు మాత్రమే..!