హైదరాబాద్: చనిపోయిన వేముల రోహిత్ చక్రవర్తి కులంపై వివాదం ఏర్పడింది. అతను దళితుడు కాదని, ఓబీసీ వర్గానికి చెందిన వడ్డెర కులం అనే వాదన వినబడుతోంది. అతని నాయనమ్మ దీనిపై మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. ఆ వీడియోలో తాము వడ్డెర కులంవారిమని, రోహిత్ తన పెద్దకొడుకుకు కొడుకని ఆమె చెప్పింది. మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇవాళ ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ, వారి గురించి పూర్తిగా తనకు తెలుసని, రోహిత్ తండ్రి వడ్డెర కులం వ్యక్తి అయినప్పటికీ, అతను రోహిత్ తల్లిని వదిలేశాడని చెప్పారు. రోహిత్ తల్లి దళిత మహిళ అని, ఆమె రోహిత్‌ను పెంచింది కాబట్టి కులం ఆమె కులాన్నే రోహిత్ తన కులంగా పెట్టుకున్నాడని తెలిపారు. అసలు రోహిత్‌కు యూనివర్సిటీలో సీటు కులం ఆధారంగా రాలేదని, మెరిట్ ఆధారంగా వచ్చిందని చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు కనబడుతోంది. రోహిత్ తన తల్లి సర్టిఫికెట్ పెట్టుకున్నప్పటికీ, ఇంటి పేరు మాత్రం తండ్రిదే పెట్టుకున్నాడు.
ఇదిలాఉంటే, రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఇవాళ ఈ కులవివాదంపై ఒక వివరణ ఇచ్చారు. రోహిత్ దళితుడేనని చెబుతూ అతను దళితుడని చూపుతున్న కుల సర్టిఫికెట్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. రోహిత్‌పై బీజేపీ, ఏబీవీపీ విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉరిశిక్షకు వ్యతిరేకంగా షార్ట్ ఫిల్మ్ తీస్తే, తీవ్రవాది యాకూబ్ మెమన్‌కు మద్దతుగా ఆ షార్ట్ ఫిల్మ్ తీసినట్లు చిత్రీకరిస్తున్నారని అన్నారు.