”ఓ మహానుబావుడి చరిత్రను రాయడం, సినిమాగా తీయడం చాలా అవసరం. ఈ ప్రయత్నాన్ని బాలకృష్ణ చేపట్టడం అభినందనీయం. తన తండ్రి పాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి దారితీస్తుంది” అన్నారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
”ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం. సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఇలాంటి కార్యక్రమాలకు రారు. ఎన్టీఆర్ మీద నాకున్న అభిమానం, స్నేహం, ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్లనే నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామారావు అభిమాని కానివారు ఎవ్వరూ ఉండరు. ఆయన నటించిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే రిలీజ్ అయ్యాయి. అదేరోజు ప్రారంభమవుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం విజయం సాధించాలి. ఆయన జీవిత చరిత్ర నవతరాలకు తెలియాలి. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. తెలుగుదనానికి, దర్పానికి ఆయన ప్రతిరూపం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే మనకు ఎన్టీఆరే సాక్షాత్కారమవుతారు. అంతగా ఆయన నటతో ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగించడం అభినందనీయం” అన్నారు వెంకయ్య నాయుడు.