తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
సుకుమార్ రంగస్థలంపై చెర్రీ నటన
‘ముఫై ఏళ్లుగా అదే నాటకం. ఇక్కడ కథానాయకుడు వుండడు. ప్రెసిడెంట్ అనే ప్రతినాయకుడు ఒక్కడే వుంటాడు’
ఇది రంగస్థలంలో ఓ డైలాగు.
ఇదే మన సినిమా రంగానికి అనువుగా మారిస్తే
‘..ఏళ్ల తరబడి అవే మూస సినిమాలు. ఇక్కడ కథ వుండదు. హీరో అనే వ్యవహారం చుట్టూనే అంతా వుంటుంది..’
అప్పుడప్పుడు అర్జున్ రెడ్డి లు, నీదీ నాదీ ఒకే కథ లు పలకరించవచ్చు. కానీ సినిమాకు పుట్టిల్లు అయిన రంగస్థలాన్ని మాత్రం ఎప్పుడో మరచిపోయాం. ఇప్పుడంతా హయం పటాటోపం. ఓ పాలెగాని కథను కూడా బాహుబలి రేంజ్ లో తీస్తే తప్ప చూడలేని పరిస్థితికి జనాలను, సినిమాను చేర్చేసాం.
ఇలాంటి టైమ్ లో 80వ దశకం నాటి పరిస్థితులు, అప్పటి స్టయిల్ ప్రేమలు, ఫ్రేమ్ లు, చూపిస్తూ సినిమా తీయడం అంటే కాస్త సాహసమే. పైగా తమిళనాట రియలిస్టిక్ సినిమా చూస్తే బాగుందనుకుంటాం, అదే తెలుగులో తీస్తే, తమిళ వాసన అంటాం. ఇలా చాలా సమస్యలు వున్నాయి. ఇన్ని వున్నా కూడా డైరక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమా తీసాడు. సుమారు ఏణర్థం కిందా మీదా పడి ఫినిష్ చేసిన రంగస్థలం లో పెద్దగా కథేమీ వుండదు.
ఓ ప్రెసిడింట్ (జగపతిబాబు) గుప్పిట్లో ఇరుకున్న గ్రామం. ఆ గ్రామంలో ఓ చెమిటి చిట్టిబాబు (రామ్ చరణ్). అతగాడికి రామలక్ష్మి (సమంత)తో ప్రేమాయణం. సాఫీగా వుంది జీవితం అనుకుంటే, చిట్టిబాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి), ప్రెసిడెంట్ ను ఎదిరించి, ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంతో మొత్తం నాటకమే మారిపోతుంది. అంతే కాదు కుమార్ బాబు హత్యతో కొత్త మలుపు తిరుగుతుంది. ఇలా మలుపు తిరిగిన నాటకానికి ఎలా తెరపడిందన్నది మిగిలిన సినిమా.
సుకుమార్ దర్శకత్వం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. కోట్ల ఖర్చు. ఈ ఒక్క లైన్ చాలు సినిమా స్థాయి ఎలా వుంటుందో చెప్పడానికి. ఎందుకంటే సుకుమార్ దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాదు. అతని సినిమాలు ఫెయిల్ కావచ్చు కానీ. ఇక ఎంచి , ఎంచి చిత్రీకరణ కు ఎంచుకున్న లొకేషన్లు దొరికితే రత్నవేలు పనితనం ఎలా వుంటుంది? ఇక దేవీ శ్రీ ప్రసాద్ పెద్ద సినిమాల విషయంలో ఎప్పుడూ నిరాశపరచడు. రామకృష్ణ చూపించిన అలనాటి గ్రామం లుక్, రాజ్ దూత్, ఎం 70 మోపెడ్ లాంటివి అన్నీ ఆనాటి వాతావరణానికి తీసుకెళ్తాయి.
అందువల్ల రంగస్థలం సినిమాకు సాంకేతికంగా ఎలాంటి వంక పెట్టడానికి కానీ, విమర్శ చేయడానికి కానీ ఆస్కారం వుండదు. ఆ అవసరమూ వుండదు. సుకుమార్ లాంటి దర్శకుడు ఎలాంటి నటుల నుంచైనా మంచి నటన రాబట్టుకోగలరు. అలాంటిది, నటుడిగా ఓ మెట్టు ఎదగాలని ఇలాంటి పాత్రను కొరి ఎంచుకుని, మనుస పెట్టి నటించిన రామ్ చరణ్ నుంచి ఇంకెంత నటన రాబట్టుకుంటాడు? అదే జరిగింది. ఈ సినిమా కేవలం రామ్ చరణ్ నటనాశక్తి, నటనాసక్తి రెండూ చూపించడం కోసమే తీసినట్లు అనిపిస్తుంది. చిట్టిబాబు అనేవాడు ఇలాగే వుంటాడు. ఇలాగే వుండాలి అనేంతగా పరకాయ ప్రవేశం చేసేసాడు రామ్ చరణ్. ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు, ప్రదర్శించిన నటన ఒక ఎత్తు. రంగస్థలం ఒక ఎత్తు. మళ్లీ ఇప్పట్లో ఇలాంటి పాత్రా రాదు. చేసే అవకాశమూ రాకపోవచ్చు. చిన్న చిన్న నటుల నుంచి సమంత, అనసూయ వరకు అందరి దగ్గర నుంచి అదే స్థాయి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు. అందువల్ల ఆ విధంగా కూడా సినిమాకు మార్కులు పడిపోతాయి.
ఎప్పుడైతే నటీనటుల నటన, సాంకేతిక విలువలు ఓ స్థాయికి చేరుకున్నాయో, సినిమా చాలా వరకు పాస్ అయిపోతుంది. కానీ అదే సమయంలో సినిమా జనాలకు ఏ మేరకు ఆసక్తి కరంగా వుంటుంది. ఏ మేరకు కదలకుండా కుర్చీలో కూర్చో పెట్టింది అన్నది కూడా చూస్తే, మిగిలిన పాస్ మార్కుల డిసైడ్ చేసుకోవచ్చు.
రంగస్థలం సినిమా గతంలో చిరంజీవి-బాపు కాంబినేషన్ మనవూరి పాండవులు సినిమా ను గుర్తుకు తెస్తుంది. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ అన్న లైన్ తో తయారైన సినిమా అది. ఆ సినిమాలో దొరతో పోలిస్తే ఈ సినిమాలో ఫణీంద్ర భూపతి అనే ప్రెసిడెంట్ చాలా మంచోడే. ఎందుకుంటే జనాల దైనందిక జీవితాలతో అతనేమీ ఆడుకోడు. అమ్మాయిలను పక్కలోకి లాగేసుకోడు. జనాలను భయంలో వుంచి, వేల రూపాయిల కోసం వారిని ‘మోసం’ మాత్రం చేస్తుంటాడు. అందుకొసం భూతనఖా సొసైటీని వాడుకుంటూ వుంటాడు. జనాలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు మాత్రం తను తీసుకుంటాడు. తన పదవికి అడ్డం వచ్చిన ముగ్గురిని చంపుతాడు. అంతే. నిజానికి ప్రెసిడెంట్ కన్నా అతని పక్కన వున్నవాడే (అజయ్ ఘోష్) నే అన్ని విధాలా దుర్మార్గుడు అనిపిస్తాడు. అసలు అతని పనులుతోటే దొరకు గొడవ వస్తుంది.అతగాడు మాట తూలకపోతే ఏ గొడవా లేదు. అతన్ని హీరో సోదరుడు కొట్టకపోతే ఏ సమస్యా లేదు. అసలు ఎన్నికలు లేదు, చావులు లేవు. కథా లేదు. అప్పటి దాకా జరిగిన హత్యలు చూసి కూడా మౌనంగానే వున్నారు ఊరి జనం. మనవూరి పాండవులు సినిమా అలాకాదు. దొర బాధలు భరించలేక జనం తిరుగుబాటు చేసే పరిస్థితి.
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే కథలో బలం అంతగా లేదన్న విషయం తెలియచెప్పడానికే. ఓ చిన్న పాయంట్, చిన్న కథను పెద్ద హంగులు అద్దడం, 80 దశకం నేపథ్యం తీసుకోవడం అనే రెండు ప్యాడింగ్ ల ద్వారా దర్శకుడు సుకుమార్ పూర్తి తెలివితేటలు ప్రదర్శించాడు. ఈ ప్యాడింగ్ లే కనుక లేకుంటే, సినిమాలో విషయం దూది పింజ అంత. అయితే ఈ ప్యాండింగ్ ల హిస్టీరియాలో సినిమా సూపరంతే అనుకోవడం పెద్ద విషయం కాదు.
సరే, ఈ సంగతి పక్కన పెట్టి సినిమా ఎలా వుందన్నది చూస్తే, సినిమా తొలిసగం చాలా చులాగ్గా నడిచిపోతుంది. చిట్టిబాబు పాత్ర, రామలక్మి, రంగమ్మత్తల డబుల్ మీనింగ్ సరదాలు ఇవన్నీ కలిసి సినిమాను చకచకా నడిపించేస్తాయి. దాంతో తొలిసగానికి మంచి మార్కులు పడిపోతాయి. 80 ల నాటి వాతావరణం, గోదావరి జిల్లా యాస కనెక్ట్ అయ్యేవారు మరి కొంచెం ఎక్కువ మార్కులే వేసుకుంటారు కూడా. సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించడానికి ముందే, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్ లోనే, కొంచెం ఇక్కడ ఆపి, ట్రిమ్ చేస్తే సరిపోయేదేమో అన్న చిన్నభావన కలుగుతుంది.
ఆ భావన ద్వితీయార్థంలోకి వెళ్లాక ఎక్కువుతుంది. ముఖ్యంగా, హీరో సోదరుడు చనిపోయిన తరువాత వచ్చే మాంటేజ్ సాంగ్, ఇతరత్రా వ్యవహారాలు తమిళ సినిమాల రియలిస్టిక్ టేకింగ్ ను గుర్తు చేస్తాయి. పైగా సినిమాలో చివరి ట్విస్ట్ ను మరింత బలంగా వుంచడం కోసం ఆసుపత్రి దగ్గర హీరో వ్యవహారాలు కూడా ఇలాగే అనిపిస్తాయి. ఇవన్నీ దర్శకుడి దృష్టిలో ఎమోషనల్ కంటెట్ కావచ్చు. రిపీట్ ఆడియన్స్ రావడానికి, లేదా పూరిగా సినిమాను ఎంజాయ్ చేయడానికి మాత్రం అడ్డం పడతాయి. ఇలా ముందుకు వెళ్లి క్లయిమాక్స్ వచ్చిన తరువాత ఆ ట్విస్ట్ తో తొలి ఆట చూసిన జనం ఫిదా అవుతారు. కానీ ఒకసారి కథ బయటకు వచ్చేసిన తరువాత, ట్విస్ట్ తెలిసిపోయిన తరువాత, ఈ మెలోడ్రామా, రియలిస్టిక్ వ్యవహారాలు అన్నీ తరువాత వెళ్లిన ప్రేక్షకులకు కాస్త బోర్ ఫీలయ్యేలా చేసే ప్రమాదం వుంది. పైగా ఆది నుంచీ ఎంతో బిల్డప్ ఇచ్చిన ప్రెసిడెంట్ కథను అలా ముగించడం కూడా ఎక్కడో చిన్న అసంతృప్తిని మిగులుస్తుంది.
తీర్పు
ఓవరాల్ గా చూసుకుంటే కామన్ ఆడియన్స్ ను రంగస్థలం పెద్దగా డిస్సపాయింట్ చేయదు. పైగా 80ల నాటి వాతావరణం చేసే మ్యాజిక్, రామ్ చరణ్ నటన, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి ఓ సక్సెస్ ఫుల్ సినిమా అనే భావననే కలిగిస్తాయి.
ఫినిషింగ్ టచ్
రంగస్థలం ముస్తాబు బాగుంది
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5