రంగస్థలం హిట్టవడం తో సుకుమార్ పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. వాటి గురించి పంచుకుంటూ, రంగస్థలం-2 పై నోరు విప్పారు సుకుమార్.
ఈ సినిమాపై వచ్చిన ప్రశంసల గురించి చెబుతూ – “శనివారం చిరంజీవిగారు ఇంటికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నారు, క్రిష్ ఫోన్ చేసి ‘డార్లింగ్ ముద్దు పెట్టుకోవాలనుంది’ అన్నాడు, బన్నీ, రవితేజ, వంశీ పైడిపల్లి ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు, చిరంజీవిగారు, మైత్రీ మూవీస్ అధినేతలు నమ్మడంతోనే ఇదంతా సాధ్యం అయింది. అన్నాడు సుకుమార్ “. అలాగే సుకుమార్ సినిమాల్లో హీరో కంటే ఎక్కువగా డైరెక్టర్ మాత్రమే పేరొస్తుందనే విషయం పై కూడా స్పందించాడు సుకుమార్. “గ్రామీణ ప్రాంతంతో ఏ సంబంధం లేని చరణ్ మొదటి సన్నివేశానికే బాగా కనెక్ట్ అయ్యి నటించాడు. చరణ్ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. తన భుజాలపై సినిమాను మోశాడు.” అంటూ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన సుకుమార్, రంగస్థలం-2 తీసే ఉద్దేశ్యం తనకి ఉందని కూడా ప్రకటించారు.
“మైత్రీ నిర్మాతలు అంగీకరిస్తే ‘రంగస్థలం 2’ కూడా తీస్తా. అయితే ముందుగా కొన్నాళ్లు కుటుంబ సభ్యులతో గడపాలి, ఆ తర్వాతే తదుపరి సినిమా గురించి ఆలోచిస్తా.. ” అన్నాడు సుకుమార్. అయితే సినిమా హిట్టయిన కొత్తలో సీక్వెల్ గురించి మాట్లాడి ఆ తర్వాత మరిచిపోవడం మామూలే మన దర్శకులకి. పోకిరి విడుదలైన కొత్తలో – “పోకిరికిరి” పేరుతో సీక్వెల్ తీసే ఆలోచన ఉందని పూరీ ప్రకటించి ఆ తర్వాత దాన్ని మరిచిపోవడం తెలిసిందే. మరి సుకుమార్ అయినా నిజంగా రంగస్థలం-2 తీస్తాడా లేక పూరీ పోకిరికిరి లాగా ఇది కూడా కాలక్రమం లో మరిచిపోతారా అన్నది వేచి చూడాలి.