ప్రతిపక్ష పార్టీ వైకాపా చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది..! కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టి… భాజపాకి చేరువయ్యే ప్రయత్నాలు చేసింది వారే..! రాష్ట్ర ప్రయోజనాల అంశమై కేంద్రంపై విమర్శలు చేయకుండా, సీఎం చంద్రబాబుపై ఆరోపణలకు దిగిందీ వారే! ఇప్పుడు, కేంద్రం తీరుపై నిరసనగా ఎంపీలు రాజీనామాలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు కూడా భాజపాని విమర్శించడం మానేసి, టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. తెలుగుదేశం ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా లేరా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
నాలుగేళ్లుగా భాజపాతో లాలూచీ పడుతూ వస్తున్నారనీ, ఇప్పుడు కూడా రాజీనామాలు చేయకుండా అదే తరహాలో భాజపాతో లాలూచీ పడతారా అంటూ రోజా విమర్శించారు. తమకు పదవులే ముఖ్యమా, రాష్ట్ర భవిష్యత్తులో పనిలేదా అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రా ఎంపీలు రాజీనామాలు చేస్తే, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం వస్తుందనీ, తద్వారా ఆంధ్రాకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని ఆమె విమర్శించారు.
ప్రస్తుతం భాజపాతో ఎవరు లాలూచీ పడుతున్నారో.. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టిస్తా, బోనులో నిలబెట్టేస్తా అంటూ ప్రకటనలు చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి ఇంతవరకూ ప్రధాని మోడీపై విమర్శలు చేయకుండా వైకాపా చేస్తున్న రాజకీయానికి లాలూచీ అని కాకుండా వేరే ఏమంటారు..? పదవుల కోసం టీడీపీ లాలూచీ పడుతోందని రోజా విమర్శిస్తున్నారు. కానీ, వైకాపా లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారట.. కానీ, విజయసాయి రెడ్డి రాజీనామా చేయరట! దీన్ని లాలూచీ కాకుండా వేరే ఏమంటారు..? అంతెందుకు… కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత, ఆంధ్రాకి కేంద్రం అన్యాయం చేసిందనే భావన ఏపీ ప్రజల నుంచి వ్యక్తమైన తరువాత.. ఒక్కటంటే ఒక్కసారైనా జగన్ గానీ, వైకాపా నేతలుగానీ కేంద్రాన్ని విమర్శించారా..? రాష్ట్ర ప్రయోజనాలను గండికొడుతున్న భాజపాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారే తప్ప… పైపైకి అవిశ్వాసం, రాజీనామాలు అంటున్నారే తప్ప, కేంద్రం మెడలు వంచే ప్రయత్నం ఏం చేశారో రోజా చెబితే బాగుంటుంది..!