ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన రాజకీయంగా కొంత ప్రాధాన్యతాంశంగానే మారింది. ఎందుకంటే, తృతీయ ప్రత్యామ్నాయం అంటూ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లి, అక్కడ కొంతమంది నేతలతో చర్చలు జరిపారు. ఓపక్క రాష్ట్ర సమస్యలపై పోరాటానికి ఇతర పార్టీల మద్దతును కూడగడుతూనే, చంద్రబాబు కూడా తృతీయ ప్రత్యామ్నాయానికి సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా అంచనాలున్నాయి. అయితే, ప్రస్తుతానికి చంద్రబాబు టూర్ అంతా ఏపీ తక్షణ ప్రయోజనాల అజెండాపైనే ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖు నేతల్ని ఢిల్లీలో కలబోతున్నారు. ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ, జేడీఎస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, శివసేన పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో చేర్చకపోవడం, ఇచ్చిన హామీలను భాజపా పట్టించుకోకపోవడం.. ఈ రెండు అంశాలపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అయితే, ఇక్కడున్న సవాలు ఏంటంటే… భాజపా వ్యతిరేక పార్టీలు ఏపీ సమస్యలపై మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ, భాజపాతోపాటు కాంగ్రెస్ విధానాలను కూడా ఈ క్రమంలో తప్పు పట్టాల్సిన అవసరం వస్తే… కొన్ని పార్టీల మద్దతు అనుమానంగానే కనిపిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ భాజపాకి వ్యతిరేకమే… కానీ, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే క్రమంలో మమతా ఉన్నారు. ఎందుకంటే, బెంగాల్ లో భాజపా ఎదుగుదలను ఆమె అడ్డుకోవాలి. కమ్యూనిస్టులు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కి దూరమయ్యారు కాబట్టి… వారికీ మమతా అవసరం ఉంది. ఎన్సీపీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసే ఉంది. ఆర్జేడీ కూడా యూపీయేలో భాగస్వామ్యంగా ఉంది. ఇక, జేడీఎస్ విషయానికొస్తే.. కర్ణాటకలో వారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. కానీ, తాజాగా సోనియా గాంధీ ఇచ్చిన విందుకు ఆ పార్టీ నేతలూ వచ్చారు. ఇక, బీజేడీ విషయానికొస్తే.. ఆ పార్టీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉందా లేదా అనే స్పష్టత వారికే లేదు. భాజపా వ్యతిరేక స్టాండ్ తీసుకోవడానికి నవీన్ పట్నాయక్ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారా లేరా అనే స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు భాజపాని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ తో కూడా అదే భావనతో ఉన్న పార్టీలంటే… తెరాస, శివసేన, ఆమ్ ఆద్మీ లాంటి కొన్ని పార్టీలే కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ పరిస్థితే ఇప్పుడు చంద్రబాబుకు సవాల్ కాబోతోందని చెప్పుకోవచ్చు. ఏపీ ప్రయోజనాలను భాజపా పట్టించుకోవడం లేదనే ఒక్క అంశాన్నే ప్రధానంగా తీసుకుంటే.. భాజపా వ్యతిరేక పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేగానీ.. కాంగ్రెస్ కూడా ఏపీకి అన్యాయం చేసిందీ, కాంగ్రెస్ చేసిన అసంబద్ధ విభజన వల్లనే ఏపీ నష్టపోయిందనే వాదన ఇతర పార్టీల ముందు వినిపిస్తే.. వారి స్పందన వేరేలా ఉండొచ్చు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కి టీడీపీ వ్యతిరేకమే. కానీ, జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే క్రమంలో ఈ వాదన ప్రతిబంధకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంత చాకచక్యంగా ఆయా పార్టీలతో డీల్ చేయబోతున్నారనేదే ఆసక్తికరమైన అంశం.