తెలంగాణ జేయేసీ నుంచి కొత్తగా ఏర్పడబోతున్న రాజకీయ పార్టీ తెలంగాణ జన సమితి. టీజేయేసీ ఛైర్మన్ కోదండరామ్ ఇవాళ్ల పార్టీ ప్రకటనను అధికారికంగా చేయబోతున్నారు. 4న పార్టీ జెండా, లోగో ఆవిష్కరిస్తారు. 29న హైదరాబాద్ లో పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. మొత్తానికి, ఇన్నాళ్లకి కోదండరామ్ పార్టీ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. అయితే, ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెరాసలు ఎవరి అంచనాల్లో వారున్నారు. కోదండరామ్ పార్టీ వల్ల రెండు పార్టీలకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ఎవరికివారు విశ్లేషించుకుంటున్నారు.
నిజానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తెలంగాణ జన సమితి చీల్చుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, కేసీఆర్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించడం అనే పునాదులపైనే కోదండరామ్ పార్టీ పుట్టింది. ముఖ్యంగా, నిరుద్యోగ యువత ఈ పార్టీ వైపు ఆకర్షితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టి, అన్ని రాజకీయ శక్తులనూ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దాన్లో భాగంగా కోదండరామ్ తో కలిసి పనిచేయడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కానీ, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టడం వల్ల నేరుగా కాంగ్రెస్ కే ఇబ్బంది. అయితే, ఆ భావన ఇప్పుడు కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తం కావడం లేదు..! కోదండరామ్ కూడా తమతో కలిసి పనిచేస్తారనీ, పొత్తు పెట్టుకుంటారనీ, ఓ 30 సీట్లలో పోటీ చేసి తమకే మద్దతు ఇస్తారనే ధీమాతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇంకొందరైతే… మరో అడుగు ముందుకేసి, కోదండరామ్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం అని అంటున్నారట!
ఇక, తెరాస ధీమా అయితే ఇంకో రకం! ఉద్యమ సమయంలో టీజేయేసీ ఏర్పాటు ఆలోచన కేసీఆర్ ది. అంతేకాదు, దీనికి ఛైర్మన్ గా కోదండరామ్ పేరును ప్రతిపాదించే ఆయన. అయితే, ఒక పార్టీగా తెరాసను ఎదుర్కొనే స్థాయికి తెలంగాణ జన సమితికి ఉండదనేది వారి అంచనా. ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ను ఏర్పాటు చేసుకోవడం, నాయకుల్ని చేర్చుకోవడం, పోటీకి దిగడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదనేది తెరాస నేతల అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కోదండరామ్ కొంత మేర చీల్చినా.. అది తమకే లాభం అవుతుందనే ధీమాతో వారున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మూడో పార్టీకి అవకాశమే లేదనీ, ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారనేది వారి అంచనా. ఇలా ఈ రెండు ప్రధాన పార్టీలూ కోదండరామ్ పార్టీని చాలా ఈజీగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ పార్టీ కి ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి.