రంగస్థలం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసినవాళ్లంతా చరణ్ నటననీ, సుకుమార్ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. `లెంగ్త్ ఎక్కువైనా… బాగానే ఉంది` అంటున్నారు. నిజానికి ఈ సినిమా లెంగ్త్ పరంగా.. దర్శక నిర్మాతల్లో కలవరం పుట్టించింది. దాదాపుగా మూడు గంటల సినిమా ఇది. దాన్ని రెండున్నర గంటలకు కుదించొచ్చు కూడా. కానీ చిరంజీవి మాత్రం `ఏం అవసరం లేదు.. ఒక్క ఫ్రేమ్ కూడా తీయకండి` అని సుకుమార్‌కి భరోసా ఇవ్వడంతో ధైర్యంగా అంత నిడివి ఉన్న సినిమానీ విడుదల చేసేశారు.
అయినప్పటికీ ఇందులో కొన్ని సీన్లు లేచిపోయాయి. ఓ కామెడీ ట్రాక్ అయితే… మొత్తానికే ఎడిట్ అయిపోయింది. రంగస్థలంలో ఫృథ్వీది ఓ సెపరేట్ ట్రాక్ ఉంది. కథకీ ఆ ట్రాక్‌కీ సంబంధం లేదు. కానీ.. చాలా బాగా వచ్చిందని టాక్. సెకండాఫ్‌లో హ్యూమర్ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందట. ఓ సినిమా హిట్టయ్యాక…తొలగించిన సన్నివేశాల్ని మళ్లీ కలపడం మామూలే. కానీ రంగస్థలంకి ఆ ఛాన్స్ లేదు. సినిమా బాగా ఆడుతున్నా… ఇప్పటికే పెరిగిపోయిన లెంగ్త్ దృష్ట్యా.. ఆయా సీన్లను కలపడం సాధ్యం కాదని తేలింది. అమేజాన్ ప్రైమ్‌లో రంగస్థలం వచ్చినప్పుడు ఫృథ్వీ ఎపిసోడ్‌ని చూసే అవకాశం ఉంది. లేదంటే ఏ యూ ట్యూబ్‌లోనో అప్ లోడ్ చేసేంత వరకూ ఆగాలి.