2018 క్యాలెండర్ కి అప్పుడే మూడు నెలల వయసొచ్చేసింది. టాలీవుడ్ క్యాలెండర్ దాదాపుగా వంద రోజులు పూర్తయినట్టే.
ఎన్నో ఆశలతో కొత్త యేడాదిలోకి అడుగుపెట్టిన తెలుగు చిత్రసీమ అనుకున్న ఫలితాల్ని అందుకుందా? ఆశలు, అంచనాలూ నెరవేరాయా? 2018 జనవరి నుంచి మార్చి వరకూ టాలీవుడ్ పోగ్రెస్ రిపోర్ట్ ఏంటి?
జనవరి
ప్రతీ యేడాది సంక్రాంతి సీజన్‌తో టాలీవుడ్ క్యాలెండర్ మొదలవుతుంది. ఈ యేడాదీ సంక్రాంతి సంబరాలకోసం జోరుగానే సిద్ధమైంది చిత్రసీమ. అజ్ఞాతవాసి, జై సింహా ఈ సంక్రాంతి బరిలో ఉండడంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. అటు త్రివిక్రమ్ ఇటు పవన్‌ల కెరీర్లో ఇదే భారీ పరాజయం. ఈసినిమాని కొన్న పంపిణీదారులు అప్పుల పాలైపోవడం, అందులోని కొంతమంది ఆత్మహత్యలకు సైతం ప్రయత్నించడం టాలీవుడ్‌ని విస్తుపోయేలా చేసింది. కొంతలో కొంత జై సింహా బెటర్. సింహా స్థాయిలో భారీ వసూళ్లు అందుకోకపోయినా… ఫర్వాలేదనిపించింది. రాజ్ తరుణ్ సినిమా… రంగుల రాట్నం సరిగా తిరగలేదు. జనవరి నెలాఖరున వచ్చిన భాగమతి… ఎవ్వరినీ నిరాశ పరచలేదు. మంచి వసూళ్లతో మెప్పించింది. అనుష్క రేంజ్ ఎలాంటిదో ఈ సినిమా చూపించింది.
ఫిబ్రవరి
ఫిబ్రవరి 2న రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఛలో, టచ్ చేసి చూడు.. వీటిలో.. ఛలో సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. రవితేజ మాస్ ఫార్ములా కంటే నాగశౌర్య వినోదాత్మక ప్రేమకథకే ఎక్కువ మార్కులు పడ్డాయి. రవితేజ సినిమా కనీసం ఓపెనింగ్స్ అందుకోవడంలో విఫలమైంది. శౌర్య.. తన కెరీర్లోనే పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తరవాత టాలీవుడ్‌కి వరుసగా మూడు పెద్ద ఫ్లాపులు తగిలాయి. హౌరా బ్రిడ్జ్, గాయత్రి, ఇంటిలిజెంట్ రూపంలో. వీటిలో ఇంటిలిజెంట్ ఫ్లాప్ అటు సాయిధరమ్, ఇటు వినాయక్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సి.కల్యాణ్‌కి భారీ నష్టం వాటిల్లింది.
తొలిప్రేమతో ఫిబ్రవరి నెలలో రెండో హిట్ చూసింది టాలీవుడ్. ఈసినిమాతో కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. వరుణ్‌తేజ్ ఖాతాలో ఇదే పెద్ద హిట్. నాని నిర్మాతగా తెరకెక్కిన `అ`.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బడ్జెట్ పరంగా చూస్తే… ఇది కూడా హిట్ సినిమా కిందే లెక్క. చాలా కాలం తరవాత తరుణ్ మళ్లీ వెండి తెరపై మెరిసే ప్రయత్నం చేశాడు. ఇది నా లవ్ స్టోరీతో. అయితే అది ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా అర్థం కాలేదు. హైదరాబాద్ లవ్ స్టోరీ, జువ్వ, రా..రా … ఇలా ఫ్లాపుల మీద ఫ్లాపులు తగిలాయి ఫిబ్రవరిలో.
మార్చి
అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన సినిమా…`ఏం మంత్రం వేశావే`. అర్జున్ రెడ్డితో వచ్చిన క్రేజ్‌ని కాస్త కిందకు దింపడానికి తప్ప ఈ సినిమా ఎందుకూ పనిచేయలేదు. ఐతే 2.. ఫట్‌మంది. కిరాక్ పార్టీ.. జస్ట్ ఓకే సినిమాగా నిలిచింది. యావరేజ్ టాక్ని హిట్ సినిమాగా మలిచేందుకు చిత్రబృందం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎం.ఎల్.ఎ, నీది నాదీ ఒకే కథ, రాజరథం….ఇవి మూడూ ఒకే వారంలో విడుదలయ్యాయి. వీటిలో ఎం.ఎల్.ఏకి మంచి వసూళ్లు దక్కాయి. నీదీ నాదీ ఒకే కథ… విమర్శకుల ప్రశంసలు పొందింది. విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. బడ్జెట్ పరంగా చూస్తే ఇదీ హిట్ సినిమానే. ఇక… మార్చి చివరిలో వచ్చిన `రంగస్థలం` ఈ యేడాదికి పెద్ద హిట్‌గా నిలిచింది. 2018లో ఓ సూపర్ డూపర్ హిట్ చూడలేకపోయామన్న లోటు రంగస్థలం తీర్చేసింది. అలా తొలి క్వార్టర్స్‌లో.. రంగస్థలంతో ఓ మంచి ముగింపు దక్కింది.