సినిమా అంటే దర్శకుడి కన్వెక్షన్. ముందు తనని తాను నమ్మాలి. ఆ తరవాత మిగిలిన వాళ్లని నమ్మించాలి. తాను నమ్మకపోతే… ఆ నమ్మకాన్ని మిగిలినవాళ్లలో తీసుకురావడం అసాధ్యం. అయితే… ఈ కన్వెక్షన్ విషయంలో సుకుమార్ తనని తాను ఫెయిల్ అయ్యాడట. ఈ విషయాన్ని తానే చెప్పాడు. ”రామ్‌చరణ్‌ని ఓ విషయంలో నేను మోసం చేశాను. తన చెవిలో చెవిటి మిషన్ పెట్టేటప్పుడు బాగుంటుందా? లేదా? అనేది నాకే తెలీదు. నాపై నాకే నమ్మకం లేదు. నేను అడిగాను. తాను పెట్టేసుకున్నాడు. ‘నా వల్ల కాదు.. .నేను పెట్టుకోను’ అంటే ఆ ప్రయత్నం అక్కడే ఆగిపోదును. నన్ను నేను నమ్మని తరుణంలో చరణ్ నన్ను నమ్మాడు. అందుకే ఈ సినిమా తీయగలిగాను. చరణ్ తనని తాను డీ గ్లామరైజ్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మంచి షర్టు ఇచ్చినా… దాన్ని మురికి చేసేసుకునేవాడు. పాత్ర తప్ప అందులో గ్లామర్ కనిపించకూడదని ఆరాటపడేవాడు. ఓ సన్నివేశంలో.. లుంగీ తీసి ఫ్యాంటు వేసుకో చరణ్ అంటే.. `లుంగీలోనే కంఫర్ట్ ఉంది డార్లింగ్` అన్నాడు. అలా… అనుక్షణం ఈ పాత్ర కోసం తపన పడ్డాడు” అంటూ రంగస్థలం థ్యాంక్స్ మీట్లో… చరణ్ ని ఆకాశానికి ఎత్తేశాడు సుకుమార్.