స్టార్ హీరోల కథల ఎంపిక అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. అన్ని విషయాల్నీ పక్కాగా బేరీజు వేసుకోవాల్సిందే. తూకంలో తేడా లేకుండా చూసుకోవాలి. ఇమేజ్, ఫ్యాన్స్ వ్యవహారాలు పట్టించుకుని తీరాలి. కానీ రామ్చరణ్ మాత్రం ‘నేనైతే ఫ్యాన్స్ గురించి అస్సలు ఆలోచించను’ అంటున్నాడు. `రంగస్థలం`తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు చరణ్. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో చరణ్ మాట్లాడుతూ ”ఓ కథ వింటున్నప్పుడు అదినాకు నచ్చాలి. నాకు నచ్చితే కచ్చితంగా అభిమానులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకూ ఎంచుకున్న కథలన్నీ అలా ఒప్పుకున్నవే. ఓ సినిమా బయటకు వచ్చిందంటే పంపిణీదారులు, కొన్నవాళ్లు లాభపడాలి. వాళ్లు హ్యాపీగా ఉంటే మంచి సినిమా చేసినట్టే. సుకుమార్ మమ్మల్ని నమ్మి తన కథని మా భుజాలపై వేశాడు. ఇప్పుడొచ్చిన విజయం చూస్తుంటే.. తను మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసుకున్నట్టే కనిపిస్తోంది” అన్నాడు.