ఓ సినిమా హిట్టయితే చాలు… సీక్వెల్ ఆరా మొదలైపోతుంది. ఈ కథని కొనసాగించే అవకాశం ఉందా? అనేది చాలా రొటీన్‌గా వినిపించే ప్రశ్న. దానికి దర్శకుడు కూడా అంతే ఇదిగా సమాధానం చెప్పేస్తుంటాడు. ”అవును.. మేం కొనసాగిస్తాం.. ఆ అవకాశం ఉంది” అని. ‘రంగస్థలం’ విజయం తరవాత కూడా ఇదే ప్రశ్న ఉద్భవించింది. దానికి సుకుమార్ కూడా రొటీన్‌గానే సమాధానం చెప్పేశాడు. ”మేం సీక్వెల్ తీస్తాం” అనేది ప్రచారం లో ఓ భాగం మాత్రమే. సినిమాకి హైప్పెంచుకోవడానికి అదో మార్గం. కాకపోతే ‘రంగస్థలం’ లాంటి సినిమాకి కొత్తగా హైప్ పెంచుకునే పనులేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి వచ్చిన బజ్ చాలు.
దానికి తోడు ‘రంగస్థలం’ సీక్వెల్‌కి అర్హమైన కథ కాదు. కథ చివరి వరకూ డ్రైవ్ అయిపోయింది. కథ కి ఎక్కడ ముగింపు పడాలో అక్కడ పడిపోయింది. కథలో కీలకమైన ప్రెసిడెంటు పాత్ర కీ తెర పడింది. చిట్టిబాబు – రామలక్ష్మి కలసిపోయారు. ఆ ఊరి సమస్యలు తీరిపోయాయి. ఇక ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది? బహుశా.. రంగస్థలంకి సీక్వెల్ అనే ఆలోచన కూడా సుకుమార్ మదిలో లేదేమో! జస్ట్.. ప్రమోషన్లలో భాగంగా ఆ మాట చెప్పి ఉంటాడు. ఒకవేళ బలవంతంగా సీక్వెల్ తీయాలనుకుంటే ఏం జరుగుతుందో.. అనుభవ పూర్వకంగా తెలుసుకున్నవాడు సుక్కు. ‘ఆర్య 2’ రిజల్ట్ గుర్తు పెట్టుకుని మసులుకుంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడేమో.