స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘యన్.టి.ఆర్’. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ… అన్నీ బాలకృష్ణే. తండ్రి పాత్రలో నటిస్తుండడంతో పాటు నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. కథ విషయంలో కసరత్తులు చేస్తున్నారు. అందర్నీ కలుస్తున్నారు.. ఒక్కర్ని తప్ప. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పోలికలతో వుండే ఆయన మనవడు, హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్‌ని బాలకృష్ణ పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్న కుమారుడితో ఆయనకు మనస్పర్థలు వున్నాయని అందరూ చెబుతుంటారు. అవి పక్కన పెడితే… మొన్న జరిగిన ‘యన్.టి.ఆర్’ ప్రారంభోత్సవంలో హరికృష్ణ, ఆయన కుమారుడు ఎన్టీఆర్ కనిపించలేదు. అందుకు కారణాలు ఏమై వుంటాయని పెద్ద చర్చ జరిగింది. ఇవీ పక్కన పెడితే… ఈ రోజు ఐపీయల్ ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎన్టీఆర్‌ని బయోపిక్ గురించి ప్రశ్నించగా “తాతగారి బయోపిక్ గురించి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. అందులో అవకాశం వస్తే అందరికీ చెబుతా” అన్నారు.