సరిగ్గా ‘రంగస్థలం’ థాంక్యూ మీట్ జరిగిన ఒక్క రోజు తరవాత, అందులో కుమార్ బాబు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టాడు. పర్సనల్ పీఆర్వోతో మీడియాకి పిలుపులు వచ్చాయి. థాంక్యూ మీట్‌కి డుమ్మా కొట్టడం, సరిగ్గా అది జరిగిన తరవాతే రోజే మీడియా ముందుకు రావడంతో ‘రంగస్థలం’ టీమ్‌కి, అతనికి మధ్య ఏవైనా మనస్పర్థలు వచ్చేయేమోననే అనుమానం కొందరికి వచ్చింది. దీనిపై ప్రెస్‌మీట్ స్టార్టింగులోనే ఆది వివరణ ఇచ్చాడు. ఫ్యామిలీ ఈవెంట్ ఒకటి.. నెక్స్ట్ సినిమా ఫోటోషూట్ మరొకటి వుండటం వల్ల ‘రంగస్థలం’ థాంక్యూ మీట్‌కి రాలేకపోయినట్టు చెప్పాడు. రామ్ చరణ్, సుకుమార్ దగ్గర నుంచి మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతల వరకూ అందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాలో పాత్ర విషయానికి వస్తే.. కుమార్ బాబు పాత్ర మరణిస్తుందనే విషయం ముందుగా తల్లిదండ్రులకు చెప్పలేదన్నాడు. బహుశా.. చెబితే వద్దనేవారు ఏమో అన్నాడు.
“నా తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి సినిమా చూశాను. నేను మరణించే సన్నివేశాలకు వారు కంటతడి పెట్టుకున్నారు. అదే నాకు లభించిన గొప్ప ప్రశంస. థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వెళ్లే సమయంలో హృదయంతో వెళ్లారు. మనకు చాలా మంచి సినిమాలు వచ్చాయి. నిజాయితీతో కూడిన ఇటువంటి సినిమా చాలా ఏళ్ల తరవాత వచ్చింది” అన్నాడు. ఓ పక్క సోలో హీరోగా చేస్తూ, మరోపక్క ‘రంగస్థలం’ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు, ‘సరైనోడు’లో ప్రతినాయక పాత్రలు చేయడానికి కారణం మంచి పాత్రలను వదులుకోవడం ఇష్టం లేకనే అని ఆది తెలిపాడు.