తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టోరీ సిట్టింగుల్లేవ్… షూటింగుల్లేవ్… మ్యూజిక్ డిస్కషన్లు లేవ్… కొత్త సినిమా రిలీజుల్లేవ్. మార్చి 16వ తేదీ నుంచి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి వ్యతికరేకంగా తమిళ ఇండస్ట్రీ స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాట కొత్త సినిమాలేవీ విడుదల కావడం లేదు. కొత్త సినిమాల మీద ఎవరూ వర్క్ చేయడం లేదు. టోటల్ ఇండస్ట్రీ బంద్ ప్రకటించారు. ఈ బంద్‌కి మొదట్లో మద్దతు తెలిసిన థియేటర్ల సంఘాలు తరవాత స్ట్రైక్ నుంచి తప్పుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వ మంత్రి కదంబుర్ రాజాతో చర్చలు జరిపిన అనంతరం తమకు కంటెంట్ ఇస్తే కొత్త సినిమాలు విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు తెలిపారు. అప్పటినుంచి తమిళనాట తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కొత్త తమిళ సినిమాలు లేకపోవడంతో చాలామంది తెలుగు సినిమాలకు వస్తున్నారు. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ చేస్తున్న స్ట్రైక్‌కి ఇది అవరోధంగా మారింది. దాంతో తమిళ పరిశ్రమ పెద్దలు తెలుగు పరిశ్రమ పెద్దలు, నిర్మాతలతో చర్చలు జరిపారు. తమిళ ఇండస్ట్రీ స్ట్రైక్‌కి మద్దతు తెలుపుతూ ఆదివారం నుంచి తమిళనాట తెలుగు సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తామని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హామీ ఇచ్చింది. ఆదివారం అంటే… ఈ రోజుతో కలుపుకుని ఐదు రోజులుంది. ఈ ఐదు రోజుల తరవాత అక్కడి థియేటర్లలో తెలుగు సినిమాలు కూడా వుండవ్. అదీ సంగతి!