గ్లామర్ డాళ్‌గా మురిపించిన అనసూయ `రంగస్థలం`లో అత్తగా దర్శనమిచ్చింది. రంగమ్మత్తగా ఆమె నటన.. అందరికీ నచ్చింది. ఈ సినిమాతో అనసూయకు కొత్త ఇమేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు. ”ఈ వయసులోనూ అత్త పాత్రలు ఒప్పుకున్నారంటే గ్రేటే.” అంటే… ”వయసుకీ, నటనకీ సంబంధం ఏముంది? నేను లేడీ ప్రకాష్‌రాజ్ టైపు. ఎలాంటి పాత్రనైనా చేయాలని ఉంటుంది. మంచి బామ్మ పాత్రలు వచ్చినా చేయడానికి రెడీనే` అంటోంది అనసూయ. రామ్ చరణ్ తనని `అత్త` అని పిలుస్తాడని తెలిసి… ముందు కాస్త కంగారు పడిందట అనసూయ. `అత్త అని పిలవొద్దు… రంగమ్మ అంటే చాలు కదా` అని సుకుమార్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేసిందట. కానీ.. డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు `రంగమ్మ అయితే ఏంటి? రంగమ్మత్త అయితే ఏంటి? రంగమ్మత్తే బాగుంది” అనుకుందట. ”నేను చేసిన పాత్రల్ని మళ్లీ మళ్లీ చేయాలనుకోవడం లేదు. క్షణం తరవాత అలాంటి అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఒప్పుకోలేదు. `రంగస్థలం` తరవాత కూడా ఇలాంటి పాత్రలే వస్తాయని నాకు తెలుసు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. రంగమ్మ నా కెరీర్లో ఓ మైల్ స్టోన్. నన్ను చూసి… అలాంటి పాత్రలు చేయడానికి మిగిలినవాళ్లు ముందుకొస్తారు. కానీ నేను మాత్రం చేయను..” అని చెప్పుకొచ్చింది అనసూయ.