ఈ రోజు విజయవాడలో జరిగిన భేటీలో సీపీఎం, సీపీఐ, తో చర్చించిన జనసేనాని హోదా కోసం కార్యాచరణ ప్రకటించారు. మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఈ నెల 6న జాతీయ రహదారులపై పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఉదయం 10గంటల నుంచి వూరూరా పాదయాత్రలు చేపట్టాలని జనసేన, సీపీఎం, సీపీఐ నిర్ణయించినట్టు చెప్పారు. ప్రధానంగా జాతీయ రహదారులపైనే ఈ పాదయాత్ర జరుగుతుందనీ, జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అక్కడి ముఖ్య కూడలిలో పాదయాత్రలు నిర్వహిస్తామనీ చెప్పారు పవన్‌కల్యాణ్.
ఈ సందర్భంగా టిడిపి, వైకాపా, బిజెపి పార్టీలని విమర్శించారు పవన్.. కేంద్రం ద్రోహం చేస్తుంటే తెదేపా, వైకాపాలు కేంద్రంపై ఒత్తిడి తేకుండా పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకు చేటు కల్గించేలా వ్యవహరిస్తున్నాయన్న పవన్, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా సభను పదేపదే వాయిదా వేసి ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తోందని బిజెపి ని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ – ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారని, అందువల్లే తెదేపా, వైకాపా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ, విజయవాడ రహదారులపైకి తాము రాబోతున్నామని, కేంద్రం స్పందించాలని డిమాండ్‌చేశారు.
అయితే ఈ మీడియా సమావేశం చూసినవాళ్ళందరూ ఆసక్తి గా ఎదురుచూసిన అంశం – ఈ పాదయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా రోడ్లపైకి వస్తాడా అని. దీనికి సమాధానంగానా అన్నట్టు స్పందించిన పవన్ -“6న జరిగిన పాదయాత్రలో విజయవాడలో నేనూ పాల్గొంటున్నా. ఏ జిల్లా నేతలు ఆ జిల్లాలోనే పాల్గొంటారు” అని ప్రకటించారు.