తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
కండీషన్‌లో ఉన్న బెంజ్ కారు
పెట్రోలు
హైవే రోడ్డు
ఇవన్నీ ఉంటే.. ఎవడైనా స్పీడు స్పీడుగా వెళ్లిపోతాడు
ఓ డొక్కు కారు
రద్దీగా ఉన్న గతుకుల రోడ్డు
ఉన్నప్పుడే అసలైన పనితనం చూపించాలి!
సినిమా విషయంలోనూ ఇంతే. మంచి కథ ఉంటే… దాన్ని ఎవరైనా డీల్ చేసేస్తాడు. కథలో విషయం లేనప్పుడే దర్శకుడిలోని అసలైన నేర్పు చూపించాల్సిఉంటుంది. ‘ఛల్ మోహన రంగ’ చూస్తుంటే.. ‘అరె.. ఇలాంటి దర్శకుడికి మంచి కథ దొరికి ఉంటే బాగుండేదే’ అనిపిస్తే అది కచ్చితంగా ప్రేక్షకుడి తప్పు కాదు. ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, విడిపోతారు, మళ్లీ కలుసుకుంటారు – ఇదీ… స్థూలంగా కథ. ఓ మాదిరి కథని.. మాధురీ దీక్షిత్‌లాంటి అందమైన అమ్మాయిగా మలచడానికి దర్శకుడు పడిన తాపత్రయం ఏమిటి? అందులో ఎంత వరకూ సక్సెస్ అయ్యాడు?
కథ
చిన్నప్పుడు తాను చూసిన అమ్మాయిని మళ్లీ ఎలాగైనా కలుసుకోవాలన్న తపనతో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు మోహన రంగ (నితిన్). ఓ శవాన్ని ఆసరాగా చేసుకుని అమెరికా వెళ్లిపోయినా.. అక్కడ వీసా కోసం నానా పాట్లూ పడతాడు. ఈ ప్రయాణంలో మేఘా (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. వాళ్లిద్దరి పరిచయం స్నేహంగా మారుతుంది. ప్రేమకి దారితీస్తుంది. ఒకరిపై మరొకరికి గుండెల నిండా ప్రేమ ఉన్నా.. `నేను తనకి, తను నాకూ సెట్ కారేమో` అనుకుని విడిపోతారు. అలా విడిపోయిన వీళ్లిద్దరూ మళ్లీ ఎలా `సెట్` అయ్యారు, ఎలా `సెటిల్` అయ్యారు? అనేదే కథ.
విశ్లేషణ
ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య పరిచయం, స్నేహం ప్రేమ..
ఆ తరవాత.. ‘ఎందుకనో’ విడిపోతారు. ఆ తరవాత మళ్లీ ఎలా కలుసుకున్నారు.. ఇదీ కథ!
– ఇలా ఎవరైనా ఓ కథ చెబితే వాడిపై ఫ్లాప్ సినిమాని బలవంతంగా చూపించేయాలన్న కసి, కోపం పెరిగిపోతాయి. కానీ.. చెప్పింది ఇక్కడ త్రివిక్రమ్ కాబట్టి ”ఆహా.. అలాగా అండీ… అయితే ఇందులో ఏదో మేటర్ ఉండే ఉంటుందండీ” అనుకోవాలి. కృష్ణ చైతన్య అలానే అనుకున్నాడు.
త్రివిక్రమ్ పై గౌరవంతో కూడిన భక్తి వల్ల ఏర్పడిన అభిమానం వల్ల కావొచ్చు… ఈ చింతల్ బస్తీలాంటి కథ ఆయనకు న్యూయార్క్ సిటీలా అందంగా కనిపించింది. తన పెన్ను బలం ఉపయోగించుకుంటూ ఒక్కో సీనూ రాసుకుంటూ వెళ్లాడు. కొన్ని మాటలు, కొన్ని సన్నివేశాలు, పాత్రల్ని మలిచిన తీరు చూస్తుంటే.. త్రివిక్రమ్ ముద్ర మరీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది త్రివిక్రమ్ కథ కాబట్టి త్రివిక్రమ్‌లానే తీయాలి అని దర్శకుడు బాగా డిసైడయ్యాడా? లేదంటే… కృష్ణ చైతన్యలోనూ త్రివిక్రమ్ స్థాయి రచయిత ఉన్నాడా? లేదంటే ఇంతకాలం.. త్రివిక్రమ్ సినిమాలు చూసీ చూసీ తను కూడా త్రివిక్రమ్‌లా మారిపోయాడా? అనే డౌటు వేస్తుంటుంది. హీరో అమెరికా వెళ్లడం, అక్కడ హీరోయిన్‌తో వీసా కోసం 5 గంటలు జర్నీ చేయడం, ఆ జర్నీలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. ఇవన్నీ సగటు సన్నివేశాలే. కానీ దర్శకుడి పెన్ను మహాత్మ్నంతో… అవి ఆహా అనిపించేలా సాగాయి. ప్రేక్షకుడికి కావల్సింది వినోదమే అని గ్రహించాడు దర్శకుడు. అది ఎక్కడా మిస్ అవ్వకుండా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. హీరో, హీరోయిన్లు విడిపోవడానికి బలమైన కారణం ఏదీ కనిపించదు. ‘ఇక్కడ విడిపోక పోతే.. ఇంట్రవెల్ కార్డు వేయడం చాలా కష్టం’ అని దర్శకుడు అనుకుని.. బలవంతంగా విడగొట్టినట్టు అనిపిస్తుంది.
సాధారణమైన కథల్ని తీసుకుంటే… ఎదురయ్యే సమస్య – సెకండాఫ్‌ని లాక్కుని రావడం. ‘ఛల్ మోహన రంగ’లోనూ అది బలంగా కనిపిస్తుంది. ద్వితీయార్థం ప్రారంభం చూస్తే.. కథని నడిపించడానికి దర్శకుడు చాలా కష్టపడుతున్నాడనిపిస్తుంది. హీరో అమెరికాలో, హీరోయిన్ ఊటీలో ఉన్నంతసేపూ – కథకీ, అందులోని ఎమోషన్స్‌కీ ఆడియన్ కనెక్ట్ అవ్వడు. ఆ తరవాత సన్నివేశాలు కూడా చాలా సాదా సీదాగా సాగిపోయాయి. `నీక్కావలసిందీ నా దగ్గర ఉందీ` అనే పాట వచ్చేంత వరకూ… ప్రేక్షకులకు ఏం కావాలో అది అందదు. అక్కడి నుంచి.. కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య బలవంతంగా అడ్డుగోడ కట్టడానికి చాలా ప్రయత్నించాడు. అయితే అది ప్రేక్షకుడికి ఆనలేదు. ‘ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండక్కర్లెద్దు.. విడిపోవడానికి దారుణాలు జరగక్కర్లెద్దు’ అని ఇంట్రవెల్ కార్డులో చెప్పాడు కాబట్టి.. కాస్త సర్దుకుపోవొచ్చంతే. సినిమా ఇంకాసేపట్లో ముగుస్తుందనగా మళ్లీ త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ కథలోకి ఎంట్రీ ఇస్తుంది. పార్టీలో నటీనటులందరినీ ఓ చోటకి తీసుకొచ్చి.. వినోదం పండించాలనుకున్నాడు. అది కాస్త శ్రుతి మించిన ప్రయాసే అనిపించినప్పటికీ అక్కడ మాటల రచయితగా కృష్ణ చైతన్య తన నైపుణ్యం చూపించగలిగి నెట్టుకొచ్చేశాడు. ఆరంభం, మధ్య భాగం ఎలా ఉన్నా ‘ముగింపు’ బాగుండాలి. ‘అ.ఆ’ సినిమాలోలా.
ఇక్కడా దర్శకుడు ఓ సింపుల్ & స్వీట్ సీన్‌తో ఎండ్ కార్డ్ వేశాడు.
నటీనటులు
పాతిక సినిమాలు చేసిన అనుభవం నితిన్‌ది. ఇక్కడ తనలోని నటుడ్ని కష్టపెట్టే సందర్భం ఒక్కటీ ఎదురు కాలేదు. మోహన రంగగా.. చలాకీగా, హుషారుగా చేసుకుంటూ పోయాడు. ద్వితీయార్థంతో పోలిస్తే ప్రధమార్థంలోనే తన క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్కువ ఫన్ పుట్టింది. సెకండాఫ్‌లో రంగా వేరేలా కనిపించాడు. మేఘా ఆకాష్ రెండో సినిమాకే చాలా నేర్చేసుకున్నట్టు కనిపించింది. ఆమె నవ్వు బాగుంది. అలాగని.. ప్రతీ డైలాగ్ నవ్వుతూనే చెబుతోంది. మిగిలిన వాళ్లకు చెప్పుకోదగ్గ పాత్రలు పడలేదు. సత్య, ప్రభాస్ శీను, మధునందన్ నవ్వించారు. రావు రమేష్‌కి రొటీన్ పాత్రే పడింది. లిజి ఓ కీలక పాత్రలో కనిపించింది. పాతికేళ్ల క్రితం లిజిని చూసినవాళ్లు.. ఇప్పుడు చూస్తే తట్టుకోలేరు.
సాంకేతిక వర్గం
కథ.. త్రివిక్రమ్ అంటూ టైటిల్ కార్డులో వేసుకోకపోతే బాగుండును. ఎందుకంటే ఇదేం కొత్త కథ కాదు. ఆ మాటకొస్తే కథే లేదు. కొన్ని సన్నివేశాల్ని అల్లుకుంటూ వెళ్లాడు దర్శకుడు. సంగీతం, ఛాయాగ్రహణం.. రెండూ బాగున్నాయి. కృష్ణ చైతన్యలో బోలెడు ప్రతిభ ఉంది. మాటల్లో తన పదును తెలుస్తుంది. ‘ఏడిస్తే కన్నీళ్లు కూడా నవ్వే రోజులు సార్’ అంటూ బలమైన మాటలు రాయగలిగాడు. త్రివిక్రమ్ శైలిలోనే ఫన్ పండించాడు. కానీ.. ఎమోషన్స్ పండించడంలో త్రివిక్రమ్ స్థాయికి వెళ్లాలంటే ఇంకొంత కాలం పడుతుంది. ఆ విషయంలో సక్సెస్ అయితే… కృష్ణ చైతన్య కూడా మంచి దర్శకుల జాబితాలో చేరిపోతాడు.
తీర్పు
రెండు గంటల పాటు సరదాగా సాగిపోయే ప్రయాణం ఇది. అక్కడక్కడ కొన్ని కుదుపులు తప్పవు. రాంగు రూట్లోకీ వెళ్లిపోవొచ్చు. కానీ చివరికి… సరైన గమ్యానికే చేర్పించాడు దర్శకుడు. మాటల్లో ఉన్న మ్యాజిక్.. కథలో కూడా కనిపించి ఉంటే.. మరింత బాగుండేది.
ఫినిషింగ్ టచ్
త్రివిక్రమ్ సీసాలో.. కృష్ణ చైతన్య నీళ్లు
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5