రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ కి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. అక్కడి నుండి ఆయన సింగపూర్ వెళ్లబోతున్నట్లు తాజా సమాచారం. రాజధాని నిర్మాణం గురించి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సమావేశమయి చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే అమరావతిలో, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరుతారని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకొనే సమయానికే పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతున్నట్లు తాజా సమాచారం. గబ్బర్ సింగ్ షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ కారణమేది చెప్పకుండా అకస్మాత్తుగా సింగపూర్ బయలుదేరడానికి సిద్దం అవుతున్నారని తాజా సమాచారం. ఆ కారణంగా షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులు కూడా దీని గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. చంద్రబాబు నాయుడు పిలిచినందునే పవన్ కళ్యాణ్ హటాత్తుగా షూటింగ్ రద్దు చేసుకొని సింగపూర్ బయలుదేరుతున్నారా..లేక వేరేమయినా వ్యక్తిగత పనులమీద వెళుతున్నారా? అనే విషయం తెలియదు. వేరే ఇతర కారణాలు ఉంటే వాటి గురించి అందరికీ తెలిసి ఉండేది. ఒకవేళ ఆయన సింగపూర్ లో చంద్రబాబు నాయుడుని కలిస్తే మాత్రం అదొక సంచలన వార్తే అవుతుంది.