ఇవాళ్ల (గురువారం) ఢిల్లీలో ఏపీ ప్రతిపక్ష ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతీరోజూ మీడియా ముందు మాట్లాడటం, ముఖ్యమంత్రిని నిందించడం వారికి దినచర్య! దాన్లో భాగంగానే వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచీ పోరాడుతూన్నది జగన్ మాత్రమే అని చెప్పారు. హోదా ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చింది తామేననీ, యువభేరి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఈ అంశాన్ని సజీవంగా ఉంచింది తామేననీ, ప్రత్యేక హోదా ఆంధ్రాకి సంజీవని అంటూ గుర్తించింది తామేననీ.. ఇలా చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది పోరాటమే కాదని విమర్శించే ప్రయత్నం మళ్లీ చేశారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చంద్రబాబు నాయుడు నిన్నంతా జాతీయ మీడియాతో మాట్లాడారు. కానీ, దీనిపై వైకాపా నిన్ననే కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు..? నిన్న (బుధవారం) వైకాపా ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టాలనుకుని కూడా ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది..? ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే భాజపాతో కుట్ర కోణం మరోసారి బయటపడ్డట్టు అవుతుంది.
నిన్న… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకూ మాట్లాడతారని అనుకున్నారు. దీంతో వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్, జీవీఎల్ వంటి నేతలు సిద్ధమయ్యారు. 5 గంటలకు తమ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకి సమాచారం ఇచ్చేశారు. అయితే, చంద్రబాబు ప్రెస్ మీట్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యేసరికి… భాజపా ప్రెస్ మీట్ 5 నుంచి 6 గంటలకు మార్చారు. సరిగ్గా ఇదే సమయంలో తాము కూడా చంద్రబాబు మీడియా సమావేశానికి కౌంటర్ ఇస్తామని వైకాపా నేతలు చెప్పారు. తమ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియా మిత్రులకు సందేశాలూ ఇచ్చారు. ఎప్పుడైతే భాజపా ప్రెస్ మీట్ 5 నుంచి 6 కి మారిందో… వెంటనే వైకాపా నేతలు మీడియా సమావేశం రద్దు చేసుకున్నారు.
అంటే, భాజపా నేతలు ప్రెస్ మీట్ పెడుతున్నారు కాబట్టి.. అదే సమయంలో తామూ మాట్లాడటం ఎందుకని అనుకుని ఉంటారు! ఎలాగూ రెండు పార్టీల వాయిస్ ఒక్కటే కదా..! నిన్నంతా భాజపా నేతలు చంద్రబాబుపై విమర్శలు చేశారు కాబట్టి.. ఢిల్లీలో వైకాపా నేతలు కామ్ గా ఉన్నారు. భాజపాకి ఆ రకంగా సాయం చేశారు. తీరిగ్గా, ఇవాళ్ల స్పందిస్తూ ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతున్నారు. వైకాపా ఇలాంటి వైఖరి అనుసరిస్తుంటే… ఏమనాలి..? వారి తీరులో రాష్ట్ర ప్రయోజనాల కోణం ఎక్కడైనా ఉందా..? అడుగడుగునా భాజపాకి కొమ్ముకాసే ధోరణి తప్ప, వేరే రకంగా వైకాపా వ్యవహార శైలి ఉంటోందా..?