హైదరాబాద్: అవును. ఈ మాట బాలకృష్ణే స్వయంగా చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన డిక్టేటర్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదు వద్ద కొంత చిత్రీకరణ జరిపామని చెప్పారు. ఆ సమయంలో తాను ఊరికే చూసొద్దామని ఆ ప్రాంతంలో తిరగటానికి వెళుతుంటే తన సెక్యూరిటీ బౌన్సర్లు వారించారని తెలిపారు. ఆ ప్రాంతంలో రౌడీలు ఎక్కువగా ఉంటారని బౌన్సర్లు హెచ్చరించారని, ఈ ప్రపంచంలో తనకంటే పెద్ద రౌడీ ఎవరూ లేరని తానన్నానని బాలయ్య చెప్పారు. మిగిలిన రౌడీలను తాను పట్టించుకోనని అన్నట్లు తెలిపారు. తాను ఆ ప్రాంతమంతా తిరిగానని, ఫోటోలు తీసుకున్నానని, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చానని చెప్పారు. తాను అనేక రకాలైన పాత్రలను, కథలను చేశానని అన్నారు. తనకు తన తండ్రి రామారావే స్ఫూర్తి అని చెప్పారు. డిక్టేటర్ లాంటి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు శ్రీవాస్‌పై ప్రశంశలు గుప్పించారు.