శ్రీరెడ్డి.. శ్రీరెడ్డి.. శ్రీరెడ్డి..
వర్మ చెప్పినట్టు ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కంటే శ్రీరెడ్డే – టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ.
‘అవకాశాల కోసం చాలా మంది పక్కలోకి వెళ్లాను. వాళ్లు వాడుకుని నన్ను వదిలేశారు’ అంటూ లేచిన గొంతు.. అందరి ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. చేస్తోంది. రోజుకో పేరు బయటకు తీసుకొస్తూ.. కలవరపాటుకు గురి చేస్తోంది. ఆమె టార్గెట్ చేసిన వ్యక్తులందరూ సెలబ్రెటీలే. ఆఖరికి శేఖర్ కమ్ముల, నానిలనూ వదిలి పెట్టలేదు. కొన్నింటికి సాక్ష్యాలు చూపించింది, ఇంకొన్నింటికి ‘మాట’ దాటేసింది. శ్రీరెడ్డి నిజం చెబుతుందో, అబద్ధం చెబుతుందో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇదంతా టైమ్ పాసా? లేదంటే పబ్లిసిటీ పిచ్చా? లేదంటే ఆమె ఏమైనా మానసిక రోగా? ఇలా రకరకాల అనుమానాలు. ఎప్పుడైతే.. ‘మా’ సభ్యత్వం కోసం రోడ్డెక్కి, అర్థనగ్న ప్రదర్శనకు దిగిందో – శ్రీరెడ్డి అలజడి పీక్స్‌కి వెళ్లిపోయింది. దాంతో ‘మా’ కూడా దిగిరాక తప్పలేదు.
ఇదవరకెప్పుడూ లేనంత.. ఎవ్వరి విషయంలోనూ జోక్యం చేసుకోలేనంతగా ‘మా’ ముందుకొచ్చి ఓ మీటింగ్ పెట్టి, వరుసగా ఒకరి తరవాత మరొకరు హైలీ ఎమోషన్ స్పీచులు, వార్నింగులూ ఇస్తూ – శ్రీరెడ్డిని దుమ్మెత్తి పోయడం చూశాం.
ఈ ఎపిసోడ్ ముగిశాక ఒక్క అనుమానం మాత్రం తప్పకుండా కలుగుతుంది. ‘మా’..కి ఇదంతా అవసర’మా’ అని!
శివాజీ రాజా ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తే సరిపోయే దానికి.. ఇంత పెద్ద మీటింగు, ఇన్ని స్పీచులూ అవసరం లేదు. శ్రీరెడ్డిని `మా`లో తీసుకుంటారా, లేదా? అనేది ‘మా’ ఇష్టం. వాళ్లకూ కొన్ని రూల్స్ ఉంటాయి. అది కాదనలేని వాస్తవం. కానీ.. ‘శ్రీరెడ్డితో కలసి నటిస్తే వాళ్లందరినీ బ్యాన్ చేస్తాం’ అనడం మాత్రం హర్షణీయం కాదు. ‘మా’ సభ్యత్వం లేకపోయినా నటించొచ్చు. శ్రీరెడ్డి సినిమాల్లో కనిపించాలంటే ‘మా’ కనికరం అవసరం లేదు. కార్డు ఇవ్వడం, ఇవ్వకపోవడం ఒక్కటే మా చేతుల్లో ఉంది. ‘నువ్వు నటించకూడదు’ అనడం నిజంగా నిరంకశత్వం. శ్రీరెడ్డిపై ఇప్పటి వరకూ ఉన్న సానుభూతి పవనాల్ని ఇలాంటి హెచ్చరికలు… మరింత బలపరుస్తాయి. శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందనుకుందాం. ఈ విషయం ‘మా’కీ తెలుసు. అలాంటప్పుడు ‘మా’ ఇంత సీరియెస్‌గా తీసుకోవడం ఎందుకు. మా వ్యాఖ్యాలు శ్రీరెడ్డి పబ్లిసిటీని మరింత పెంచుతాయి కదా? ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడం ఎవ్వరూ హర్షించదగినది కాదు. అలాగని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిస్తున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా సమర్థనీయం కాదు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో శ్రీరెడ్డికి అవకాశం వచ్చింది. ఇప్పుడది పోవొచ్చు.
ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా ఒక వైపు, శ్రీరెడ్డి ఒకవైపు. కాకపోతే.. సానుభూతి మాత్రం కొంచెం శ్రీరెడ్డి వైపు కూడా ఉంది. అది ‘మా’ చర్యల వల్ల కొంచెం పెరిగింది. శ్రీరెడ్డిని ఇలా బహిష్కరించడం వల్ల మరో పెను నష్టం కూడా ఉంది. ఇక మీదట మరింత మంది ప్రముఖుల జాతకాలు శ్రీరెడ్డి మొహమాటం లేకుండా బయటపెట్టే ఛాన్సుంది. ఇప్పటి వరకూ ‘సినిమా అవకాశాలు వస్తే చాలు’ అనుకున్న శ్రీరెడ్డి.. అవి రావని తెలిసినప్పుడు మరింత రెచ్చిపోవడం ఖాయం. మరి దాన్ని ‘మా’ తట్టుకుంటుందా?