హోదా సాధన దిశగా సాగించిన అలుపెరుగని పోరాటంలో ఆఖరి అస్త్రంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, నిరాహార దీక్షలకు దిగారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలను అస్వస్థత కారణంతో ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు మాత్రమే దీక్ష చేస్తున్నారు. అయితే, ఆసుపత్రి నుంచి వారు తిరిగి దీక్షా శిబిరానికి వస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఇక, వైకాపా ఎంపీల రాజీనామాల విషయానికొస్తే… ఐదుగురు ఎంపీలూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసినప్పటికీ, ఇంకా వాటి ఆమోదం జరగలేదు.
ఈ ఐదుగురు ఎంపీల రాజీనామాలను ఇప్పటికిప్పుడే స్పీకర్ ఆమోదించేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాదు, రాజీనామాలు ఆమోదం పొందకుండా చేసుకునేందుకు కూడా వైకాపాకు అనువైన వాతావరణం కేంద్రం దగ్గర ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. నిజానికి, ఎంపీలు రాజీనామాలు చేసిన వెంటనే వారిని స్పీకర్ స్వయంగా పిలవాలి. ఎందుకు రాజీనామాలు చేశారో తెలుసుకున్నాకనే, వారు రాజీనామాలు చేశారని ప్రకటించి, ఆమోదిస్తారు. అయితే, ఆ అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేసిన వెంటనే వైకాపా ఎంపీలు దీక్షకు కూర్చుండిపోయారు. దీంతో స్పీకర్ పిలిచి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.
దీంతో ఈ రాజీనామాలను ఎప్పుడు ఆమోదిస్తారనే చర్చ పక్కకు వెళ్లింది. ఎలాగూ వారికి ఇప్పుడు భాజపా పెద్దల అండ బాగా ఉంది కాబట్టి, రాజీనామాలు ఆమోదం పొందకుండా చూసుకోగలరనే అభిప్రాయమూ వినిపిస్తోంది. పోనీ, కనీసం లోక్ సభ స్పీకరైనా స్వతంత్రంగా వ్యవహరించి, రాజీనామాలపై స్పందించే అవకాశం ఉందా అంటే.. అదీ లేదు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా, సభ ఆర్డర్ లో లేదన్న కారణంతోనే నెట్టుకొచ్చిన తీరును మనం చూశాం.
ఇక, రాజ్యసభ సభ్యుల రాజీనామా అంశం ఇప్పుడు నెమ్మదిగా చర్చనీయం అవుతోంది. పార్లమెంటు సభ్యులు అంటే ఉభయ సభలకూ చెందినవారౌతారనీ, కానీ వైకాపా మాత్రం కేవలం లోక్ సభ సభ్యులతో మాత్రమే రాజీనామాలు చేయించి, రాజ్యసభ ఎంపీలకు అది వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తుండటం ద్వంద్వ వైఖరి అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైకాపా రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే, వెంటనే తానూ రాజీనామా చేస్తానంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సవాల్ చేశారు. అయితే, వీటిపై వైకాపా నేతలు స్పందించదు కదా! ఎందుకంటే, ముఖ్యంగా విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించడం వారికి సాధ్యం కాని పని కదా! ఆయన ఢిల్లీలో ఉండాలి, కేంద్రంతో టచ్ లో ఉండాలి కదా!