ఏడాదిలో ఎన్నికలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఎన్నికలకు సంసిద్ధం కావాలంటే.. పార్టీలో నాయకులేరీ? ఇప్పుడు ఇదే సమస్య జనసేనను వెంటాడుతోందని చెప్పాలి. జనసేన అంటే పవన్ గొంతు ఒక్కటే వినిపిస్తోంది. ఆ తరువాత, పార్టీలో ఎవరున్నారూ, పేరున్న నాయకులు ఎవరు, సమర్థవంతమైన ద్వితీయ శ్రేణి ఏదీ అనే ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. అందుకే, పార్టీ గొంతును సమర్థంగా వినిపించగలిగే నాయకుల కోసం పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
ఇక్కడే పవన్ కొంత సందిగ్దానికి గురౌతున్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి నాయకులను ఆహ్వానిస్తే పరిస్థితి ఎలా ఉంటుందీ, కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందీ అనే డోలాయమానంలో పవన్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇతర పార్టీలంటే.. ఎవర్ని ఆహ్వానించాలి, ఎవర్ని తీసుకోవాలనేది పెద్ద ప్రశ్న..? ఎందుకంటే, ఇతర పార్టీల నుంచి వచ్చేవారితో జనసేన పార్టీ ఇమేజ్ ఏ రకంగా మారుతుందీ అనే చర్చ కూడా ఉంటుంది కదా. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జనసేన ప్రతినిధులు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. అయితే, పార్టీ మారాలన్న ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించారనీ అన్నారు. సో.. ఇతర పార్టీల నేతల కోసం జనసేన వెతుకులాట జరుగుతోందనేది వాస్తవమే అనిపిస్తోంది.
ఓ నలభైమంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఆ మధ్య జనసేన నేతలు అన్నారు. తరువాత ఆ అంశాన్ని వారే వదిలేశారు. దానికారణం చేరికలపై పవన్ పడుతున్న గందరగోళమే. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పడు వచ్చినవారిని వచ్చినట్టుగా చేర్చుకుని, తరువాత ఇబ్బందులుపాలైన అనుభవం పవన్ కి గుర్తుంది. అందుకే, నాయకుల చేరికలపై ఇంకా ఆలోచిస్తున్నారట! అయితే, రోజువారీ రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు జనసేనకు కొంతమంది నాయకులు తక్షణ అవసరం. ఇప్పటికే కొంతమంది అధికార ప్రతినిధులను నియమించుకున్నా… వారు సమర్థంగా పనిచేయడం లేదనే అసంతృప్తి పవన్ లో ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి.
కనీసం ఓ ఏడాది కిందటైనా నేతల కోసం అన్వేషణ సాగిస్తే… చేరేవారి సంఖ్య ఇప్పటితో పోల్చితే కొంత ఎక్కువగా ఉండేదేమో. ఎందుకంటే.. ఇప్పుడు పవన్ టీడీపీని వ్యతిరేకిస్తున్నారు, భాజపాని విమర్శిస్తున్నారు, వైకాపాపైనా మండిపడుతున్నారు. సో.. వచ్చే ఎన్నికల్లో పవన్ సోలోగా పోటీ చేయాల్సిన వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఎవ్వరితోనూ పొత్తు సాధ్యం కాదనే చెప్పాలి. పటిష్టమైన నిర్మాణం లేని పార్టీగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో అనే అంచనా.. చేరబోయే సగటు నేతలకు ఉంటుంది కదా!