అబ్బాయ్ రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాను బాబాయ్ పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో చూశారు. అన్నయ్య కుమారుడితో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్ ఎర్నేని, చిత్ర బృందాన్ని అభినందించారు. పవన్ సినిమా చూడటానికి ఒక్క రోజు ముందు ఆయన కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫేస్బుక్లో రామ్‌చరణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. అల్లు అర్జున్, అఖిల్ పుట్టినరోజులు కూడా ఆ రోజే. వాళ్ళిద్దరికీ ఒక్క పోస్టులో విషేష్ తెలిపిన చరణ్, అకిరా కోసం మరో పోస్ట్ చేశాడు. అంతేనా… పవన్, అకిరా, ఆద్యలతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇంకొన్ని రోజులు ముందుకు వెళితే… రామ్‌చరణ్ పుట్టినరోజుకి చిరంజీవి ఇంటికి వెళ్ళాడు పవన్. అన్నావదినలతో భోజనం చేశాడు. అబ్బాయ్ చరణ్‌కి పుట్టినరోజు ప్రత్యేకంగా గుర్తుండేలా చేశాడు. ‘రంగస్థలం’ సక్సెస్ మీట్లో సినిమా గురించి మరింత మాట్లాడతానని సినిమా చూసిన తరవాత చెప్పాడు. ఇటీవల అందివచ్చిన ఏ సందర్భాన్నీ మెగా కుటుంబం వదులుకోవడం లేదు.తమ మధ్య అనుబంధాన్ని చూపించుకోవడానికి ఎక్కువగా వాడుకుంటోంది. అభిమానులకు ఈ సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సినిమా, రాజకీయ విశ్లేషకులు ఈ మెగా పవనాలకు ఎటు వీస్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఓ రెండు మూడేళ్లు వెనక్కి వెళితే… మెగా హీరోలు నటించిన ప్రతి సినిమా వేడుకలోనూ పవన్ అభిమానుల హంగామా భరించలేని స్థాయిలో వుండేది. మెగా వేడుకలకు పవన్ వచ్చేవారు కాదు. దాంతో అభిమానులు పవన్ ఎక్కడ? ఎక్కడ? అంటూ అరిచేవారు. మెగాస్టార్ మాట్లాడినా అదే తంతు. ఓ దశలో ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిగతా హీరోలు పైకి చెప్పుకున్నా ఇబ్బంది పడిన మాట వాస్తవం. రాజకీయం అన్నయ్య చిరంజీవితో పవన్ విభేదించడం, సొంత కుంపటి పెట్టుకోవడం తదితర పరిణామాలు అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందనే వార్తలకు బలం చేకూర్చాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయ్. క్రీయాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా వుంటున్నారు. రాజకీయాలు తప్ప సినిమాల గురించి పవన్ ఆలోచించడం లేదు. సినిమాల పరంగా, రాజకీయాల పరంగా అభిమానుల మధ్య గొడవలకు తావు లేకుండా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తమ సఖ్యతను ప్రజలకు తెలిసేలా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల పరంగా చిరంజీవి బాటే నా బాట అంటూ అల్లు అర్జున్ కూడా ఇటీవల చెప్పడంతో మెగా కుటుంబంలో మనస్పర్థలు తొలుగుతున్నట్టు కనిపిస్తున్నాయి.