ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు రవితేజది. 2000 నుంచి 2012 వరకూ వీలైతే నాలుగైదు, లేదంటే మినిమమ్ మూడు సినిమాలు చేశాడు. 2013 నుంచి స్పీడ్ తగ్గించాడు. ఏడాదికి ఒక్కో సినిమా చేస్తూ వస్తున్నాడు. 2015లో రెండు సినిమాలు చేశాడు. 2016లో రవితేజ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది ‘రాజా ది గ్రేట్’, ఈ ఏడాది ‘టచ్ చేసి చూడు’ రిలీజ్ చేశాడు. ఈ ఏడాది మరో రెండు సినిమాలు విడుదల చేసేలా కనిపిస్తున్నాడు. మళ్ళీ మునుపటి స్పీడ్ రవితేజలో కనిపిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నెల టికెట్’ చేస్తున్న మాస్ మహారాజ్, ఇటీవలే శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ స్టార్ట్ చేశాడు. వచ్చే నెలలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమా స్టార్ట్ చేస్తాడని సమాచారం.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుంది. సంతోష్ శ్రీనివాస్ సినిమానూ అదే సంస్థ నిర్మించనుంది. బ్యాక్ టు బ్యాక్… ఓ సంస్థలో రవితేజ సినిమాలు చేయడం బహుశా ఇదే తొలిసారి అనుకుంట. ఓ పక్క ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రీకరణ చేస్తూ.. మరోపక్క కొత్త సినిమా ప్రారంభించాలని రవితేజ-మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. మే నెలలో సంతోష్ శ్రీనివాస్ సినిమాను ప్రారంభిస్తారట. యాక్చువల్లీ… పవన్ కల్యాణ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ సంస్థ సినిమా చేయాలనుకుంది. రాజకీయాల కోసం కొన్ని రోజులు సినిమాలను పక్కన పెట్టాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అదే కథను రవితేజతో తీస్తున్నారు. ఇందులో కేథరిన్ కథానాయికగా నటించనున్నారు.