పట్టువదలని విక్రమార్కుడి తరహాలో తెలుగు తెరపై విజయం కోసం బెంగళూరు బ్యూటీ ప్రణీత దండయాత్రలు చేస్తూనే వుంది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు,ఎన్టీఆర్ సినిమాల్లో నటించినా అమ్మడికి చెప్పుకోదగ్గ హిట్ లేదు. పవన్ ‘అత్తారింటికి దారేది’ మాత్రమే ప్రణీతను తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకునేలా చేసింది. అందులో పాట పుణ్యమా అంటూ ముద్దు ముద్దుగా ఆమెను ‘బాపు బొమ్మ’ అంటున్నారు కొంతమంది. ‘బ్రహ్మోత్సవం’ తరవాత తెలుగు తెరకు దూరమైన ఈ బాపు బొమ్మకు యువ హీరో రామ్‌తో నటించే అవకాశం వచ్చింది.
రామ్ హీరోగా ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ సినిమాల ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘హలో గురూ… ప్రేమ కోసమే’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఒక హీరోయిన్. మరో హీరోయిన్గా ప్రణీతను సెలెక్ట్ చేశారు. త్వరలో ఆమె షూటింగులో జాయిన్ కానుంది. అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలో ప్రణీత అయితే బాగుంటుందని దిల్ రాజు భావించడంతో ఆమెకు ఛాన్స్ లభించినట్టు సమాచారం.