ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఢిల్లీలో వైకాపా ఎంపీలు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, మొత్తం ఐదుగురు ఎంపీలూ రాజీనామా చేసి దీక్షకు దిగారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి చేరారు. మిగతా ఇద్దరు ఎంపీల దీక్ష కూడా పోలీసులు భగ్నం చేశారు. ఇదే అంశమై ఓ న్యూస్ ఛానెల్ తో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఎంపీలు మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారనీ, కార్యకర్తలు అడ్డుకుంటున్నా, దీక్ష విరమించేందుకు వారు ఒప్పుకోకున్నా, వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని విజయసాయి రెడ్డి చెప్పారు.
వైకాపా ఎంపీలు చేస్తున్న పోరాటాన్నీ, టీడీపీ నేతలు అనుసరించిన వైఖరినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. చిత్తశుద్ధి లేకుండా టీడీపీ ఎంపీలు వ్యవహరించారని ఆరోపించారు. రాజ్ ఘాట్ దగ్గరకి వెళ్లి మొక్కుబడి కార్యక్రమం చేశారనీ, ప్రధానమంత్రి ఇంటిముందు ధర్నా కూడా అలాంటి కార్యక్రమమే అని ఎద్దేవా చేశారు. ఏదో ఫొటోలు దిగడానికి వచ్చినట్టుగా, ప్రధాని ఇంటికి ఓ కిలో మీటరు ముందు డ్రామాలు చేశారనీ… ఆ కార్యక్రమానికి ఎంపీ సుజనా చౌదరి బెంజికారులో వచ్చారని ఆరోపించారు. ఆ తరువాత, సుజనా చౌదరి ఎవరిని కలిశారూ, ఎక్కడికి వెళ్లారూ, ఎందుకెళ్లారు అనే వివరాలు ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30 సార్లు ఢిల్లీకి వచ్చానని చెబుతారనీ, దాదాపు 50 సార్లు ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లారన్నారు. దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచిపెట్టడం కోసమే ఆయన విదేశాలకు వెళ్లారని విజయసాయి అన్నారు. విదేశాల్లో సొమ్ము దాచుకోవడంపై ఉన్న చిత్తశుద్ధి సొంత రాష్ట్రంపై ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల తరువాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేననీ, అలాంటి పార్టీకి తాము మద్దతు ఇస్తామని విజయసాయి చెప్పారు. హోదా సాధించే వరకూ వైకాపా పోరాటం కొనసాగుతుందన్నారు. సో.. హోదా ఇప్పుడు రాదనీ ఆయనే చెబుతున్నారు, కానీ పోరాటం చేస్తామనీ వారే అంటారు! వైకాపా పోరాటం గురించి చెప్పండి అని అడిగితే… సుజనా ఎటెళ్లారు, చంద్రబాబు విదేశాలకు ఎందుకెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. సుజనా ఎటెళ్లారో తెలిస్తే.. ప్రజలకు చెప్పొచ్చు కదా! చంద్రబాబు విదేశాల్లో దాచిన డబ్బు వివరాలు తెలిస్తే వాటినీ ప్రజల ముందు పెట్టొచ్చు కదా! ఎవరొద్దంటున్నారు..?