కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రి నారా లోకేష్ పై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ లకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉందనీ, అలాంటప్పుడు వారు ఆంధ్రప్రదేశ్ లో స్థానికులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగేళ్లుగా కాపు జాతిని మభ్య పెడుతూ వస్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా, కేంద్రం నుంచి వస్తున్న నిధుల లెక్కలకు సంబంధించి స్పందిస్తూ… ప్రజాధనం ఎలా ఖర్చు చేశారని లెక్కలు అడిగితే ముఖ్యమంత్రికి కోపం వస్తుందని ఎద్దేవా చేశారు.
కాపుల రిజర్వేషన్ల అంశంపై అబద్ధాలు చెబుతూ నెట్టుకొస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చంద్రబాబు నీరు కార్చేయడం వల్లనే రాకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఓ మూడు నెలల ముందు కాపు జాతి ప్రయోజనాలకు అనుగుణంగా కీలక రాజకీయ నిర్ణయం ఉంటుందని ముద్రగడ ప్రకటించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఏ పార్టీకి ఇస్తారనే అంశంపై కూడా స్పందిస్తూ… తమ జాతికి న్యాయం చేసేవారికే మద్దతు ఉంటుందన్నారు. అంతేకాదు, జనసేన పార్టీకి చెందిన కొంతమంది తనను కలిశారనీ, పార్టీకి సంబంధించి కొన్ని సలహాలూ సూచనలూ అడిగి తీసుకున్నారని ముద్రగడ చెప్పారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు కీలక రాజకీయ నిర్ణయాలు ఉంటాయని ముద్రగడ సంకేతాలు ఇవ్వడం కొంత చర్చనీయాంశంగానే కనిపిస్తోంది. ఓపక్క జనసేన నేతలు తనను కలిశారని చెబుతారు, సలహాల కోసమే వచ్చారని చెబుతున్నారు. ఇంకోపక్క… కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల ప్రస్థావన తీసుకొస్తూ లెక్కలు చెప్పరా అంటూ కేంద్రం తరఫు వాయిస్ వినిపించే మాదిరిగా స్పందించడమూ విశేషమే. సో.. ఎన్నికలకు మూడు నెలల ముందు ముద్రగడ తీసుకోబోయే రాజకీయ నిర్ణయం టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందా అనేదే చర్చ.